70 అడుగుల ఖైరతాబాద్ మహాగణపతి రెడీ (పూర్తి వివరాలు)
న్యూస్ తెలుగు/హఐహైదరాబాద్: ఖైరాతాబాద్ మహాగణపతి పూజలందుకోవడానికి సిద్ధమయ్యాడు. దేశవ్యాప్తంగా ఈ గణేశుడికి ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయం తెల్సిందే. ఖైరతాబాద్ ఉత్సవాలను ప్రారంభించి 70 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈసారి 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. సప్తముఖ మహాగణపతిని నిర్వాహకులు ఆవిష్కరించారు. ముహూర్తం ప్రకారం గురువారం మధ్యాహ్నం 12 గంటలకు శిల్పి చినస్వామి రాజేంద్రన్.. గణపతికి నేత్రాలను తీర్చిదిద్ది విగ్రహానికి ప్రాణం పోశారు. భక్తులు జయజయ ధ్వానాలు నడుమ ఉత్సవ కమిటీ ప్రతినిధులు గుమ్మడికాయలు, కొబ్బరికాయలు కొట్టి బలి తీశారు. ఇదిలావుండగా, భక్తులు విపరీతంగా పెరిగే అవకాశం ఉండటంతో ఈసారి 400 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈసారి శని, ఆదివారాలు రెండు సార్లు రావడంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిరోజునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్లు పూజలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో 24 గంటల పాటు 3 షిఫ్టుల్లో పోలీసులు విధులు నిర్వహించేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. భారీ గణపతి వద్ద బందోబస్తు కోసం ముగ్గురు డీఎస్పీలు, 13 మంది ఇన్స్పెక్టర్లు, 33 మంది ఎస్ఐలు, 22 ప్లాటూన్ల సిబ్బంది పనిచేస్తారని సైఫాబాద్ ఏసీపీ ఆర్ సంజయ్ కుమార్ తెలిపారు. అలాగే, గణపతికి మూడు వైపులా 500 మీటర్ల వరకు నో వెండింగ్ జోన్ ఉందని, చిరు వ్యాపారాలకు అనుమతి లేదని సైఫాబాద్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆనంద్ తెలిపారు. మరోవైపు, ఉత్సవ కమిటీ తొలిసారిగా ఆగమన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. స్థానిక యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహంగా నృత్యాలు చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి కూడా పాల్గొని డ్యాన్స్ చేశారు. (Story: 70 అడుగుల ఖైరతాబాద్ మహాగణపతి రెడీ (పూర్తి వివరాలు))