వరదల్ని రాజకీయాలకు వాడుకోవడం రాక్షసత్వానికి పరాకాష్ఠ
ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
న్యూస్‌తెలుగు/వినుకొండ : వరదలు వంటి విపత్తుల్లో ప్రజలను సాధ్యమైనంత మేర ఆదుకోవాల్సింది పోయి వాటిని కూడా రాజకీయాలకు చెయ్యడం వైకాపా, జగన్ రెడ్డి రాక్షసత్వానికి పరాకాష్ట అని తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ధ్వజమెత్తారు. పీకల్లోతు నీళ్లలో మునిగి ఉన్న వ్రజలకు ఈ సమయంలో కావాల్సింది ఆహారం, ఔషధాలు, తక్షణ సాయం అని మరిచిపోయి పనికి మాలిన మాటలు మాట్లాడితే ఎలా ప్రశ్నించారాయన. వారి అడ్డగోలు అబద్ధాలు, తప్పుడు ప్రచారాలను ప్రజలు చీ కొట్టి తిరస్కరించినా ఇంకా అదే రీతిలో ప్రజల్ని మోసగించవచ్చని అనుకుంటే పొరపాటే అని చురకలు వేశారు. కష్టం వచ్చిన 5రోజుల తర్వాత విధి లేని పరిస్థితుల్లో విమర్శలకు జడిసి లండన్ పర్యటన రద్దు చేసుకున్నా మాజీ సీఎం జగన్ రెడ్డి బుద్ధి మాత్రం మారినట్లు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఈ మేరకు బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేసిన ఎమ్మెల్యే జీవీ అసలు బుడమేరును చంపి విజయవాడను ముంచిందే జగన్‌రెడ్డి అన్నారు. అలాంటివ్యక్తి చేసిన తప్పులు ఒప్పుకోకపోగా ప్రభుత్వంపై బురదరాజకీయం చేయడం ఆ పార్టీ దివాళకోరుతనానికి నిదర్శనమన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని కేవలం ఆక్రమణ లు, అరాచకాలకే వాడిన అతడొక్కడు చేసిన తప్పులతోనే ఇనాళ లక్షలమంది ఇబ్బందుల్లో పడ్డా రని గుర్తించాలన్నారు. గడిచిన అయిదేళ్లు అధికారం వెలగబెట్టిన జగన్ రెడ్డి బుడమేరు బాగు కోసం ఏం చేశారు? వాగులు, వంకల్లో పూడికతీతలు, ఆక్రమణల తొలగింపులపై సరైన చర్యలు ఎందుకు తీసుకోలేదు? అని చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు . ఇదే సమయంలో బాధితులకు సాయం అందలేదని జగన్ అనడం తప్పు, అన్నివిధాల ప్రభుత్వం ఆదుకుందని ప్రజలే చెబుతున్నా సిగ్గులేకపోతే ఎలా అని మండి పడ్డారు. జరుగుతున్న పరిణా మాలు చూస్తే ప్రకాశం బ్యారేజీ గేట్ల విషయంలో కూడా వైకాపా కుట్రలు దాగి ఉన్నాయనే అనుమానాలు వస్తున్నాయన్నారు. ఒకవేళ అవే గనక నిజమైతే బాధ్యులైన వారిని ఆ దేవుడు కూడా కాపాడలేడని హెచ్చరించారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీ అయినా వరద బాధితులకు సాయం చేయడంలో ఉండాలి గానీ వైకాపా వాళ్లు చంద్రబాబు ఇల్లు, అమరావతిపై కుట్రలు చేయడంలో మునిగిపోవడం బట్టే వాళ్ల నిజస్వరూపాల్ని అంతా గమనిస్తున్నారన్నారు. అయిన వాళ్లను చంపడం, అమాయకులను ముంచడం జగన్‌కు అలవాటైన పని అని, అంతా అలానే ఉంటారని అనుకుంటే ఎలా అన్నారు. 20ఏళ్ల క్రితం ఇదే బుడమేరు పొంగినప్పుడు కూడా విజయవాడ లో మోకాల్లోతే నీరు వచ్చిందని… కానీ ఇప్పుడు నగరం మొత్తం మునిగిపోవడానికి వైకాపా నేత లు చేసిన ఆక్రమణలే కారణమనీ స్పష్టం చేశారు. అందుకే జగన్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడం ఆంధ్రప్రదేశ్ చేసుకున్న ఖర్మ అని ప్రతిఒక్కరు తిట్టుకుంటున్నారన్నారు. ఒకప్పుడు ఇదే జగన్ రెడ్డి ఇసుక మాఫియా కారణంగానే అన్నమయ్య ఆనకట్ట కొట్టుకుపోయింది. 45మంది ప్రాణాలు పోయాయి, వేలాదిమంది నష్టపోయారనీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాబట్టి ఇకనైనా జగన్ రెడ్డి శవాలపై పేలాలు వేరుకునే చిల్లర మనస్తత్వాన్ని మార్చుకోవాలని, సాక్షి పత్రికలో, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు ఆపితే మేలని జీవి హితవు పలికారు. (story ; వరదల్ని రాజకీయాలకు వాడుకోవడం రాక్షసత్వానికి పరాకాష్ఠ)