ఎన్నికలే అజెండాగా ఆరెస్సెస్ కులగణన ప్రకటన
- రిటైర్డ్ డీజీపీ, బహుజన సమాజ్‌పార్టీ (బీఎస్‌పీ) ఏపీ కోఆర్డినేటర్ డా.పూర్ణచంద్ర రావు
- నిజాయితితో కులగణన అమలు చేసి బీసీలకు న్యాయం చెయ్యాలి: BSP రాష్ట్ర అధ్యక్షులు బి పరంజ్యోతి
న్యూస్‌తెలుగు/విజయవాడ: కులగణనపై ఇటీవల ఆర్ఎస్ఎస్ చేసిన ప్రకటన కేవలం ఎన్నికల ఎజెండాగా ఉందని రిటైర్డ్ డీజీపీ, బహుజన సమాజ్‌పార్టీ (బీఎస్‌పీ) ఏపీ కోఆర్డినేటర్ డా.పూర్ణచంద్ర రావు వ్యాఖ్యానించారు. ఉన్నట్టుండి కులగణనకు మేము సముఖంగా ఉన్నాము అని ఆరెస్సెస్ చెప్పటం విడ్డూరమైన విషయం, ఇది కేవలం రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన ప్రకటనలా ఉంది, అని పూర్ణచంద్ర రావు అభిప్రాయపడ్డారు.
“ఇవాళ ఆరెస్సెస్ ఈ ప్రకటన ఎందుకు చేసింది. వచ్చే రెండు మూడు నెలల్లో కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయనా? మరి ఇదే ఆరెస్సెస్ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి చెప్పి కులగణన అమలుకు కార్యాచరణ ప్రకటించేలా చేయచ్చు కదా”
“కులగణన డేటా కేవలం సంక్షేమం కోసం అంటున్నారు వీళ్ళు. మరి రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా, బడుగు, బలహీన అణగారిన వర్గాలకు సంక్షేమం సమర్థవంతంగా ఎలా అమలు చేయగలరు. ఇక్కడే వీరి నిబద్ధత తేటతెల్లం అవుతోంది.”
“ఆంధ్రప్రదేశ్లో వారి కూటమి సర్కారుపై కులగణనపై వస్తున్న ఒత్తిడి కూడా రేపు వారిని ఇరకాటంలో పెడుతుంది, గడచిన కొద్దీ నెలలుగా మేము బీఎస్పీ తరపున ఆంధ్రప్రదేశ్ లో కులగణనపై మా పోరాటం అంచెలంచెలుగా తీవ్రతరం చేస్తూ పోతున్నాము. అందుకే అటు ఎన్నికల కోసం, ఇటు కేంద్రంలో ఎన్డీయే సర్కారును కాపాడుకోవటానికి చేసిన ప్రకటన మాత్రమే.”
ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బి పరంజ్యోతి మాట్లాడుతూ, “కులగణనను రాజకీయంగా వాడుకోవద్దట. అసలు కులగణనపై పోరాడేదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల రాజకీయ ప్రాతినిధ్యం, ప్రాముఖ్యత కోసం, ఇందులో రాజకీయాన్ని ఎవరు వెతుకుంటున్నారు. గుమ్మడికాయల దొంగంటే భుజాలు తడుముకున్నట్టు రాజాకీయపరంగా దీన్ని చూస్తుంది బీజేపీ మాత్రమే, కాంగెస్ కూడా ఇందులో తోడు దొంగే.”
“ఎప్పుడు కులగణన గురించి మాట్లాడినా, హిందువుల ఐక్యత అని మతంలోనే చిచ్చుపెట్టే విధంగా రాజకీయ ప్రకటనలు చేస్తుంది బిజెపియే. అందుకే బీఎస్పీ తరపున మేము బీజేపీ, ఆరెసెస్లను సవాలు చేస్తున్నాము, ప్రకటనలు కాదు, కార్యాచరణతో రండి”
“కాంగ్రెస్ 7 దశాబ్దాలుగా అధికారంలో ఉండి కులగణన కోసం చేసే డిమాండ్ కూడా బూటకమే. ఆంధ్ర, ఢిల్లీ ప్రభుత్వాలు తక్షణం సకల కులగణన చేపట్టాలి. లేకపోతే ప్రజాగ్రహాన్ని ఎదుర్కొoటారు.” అని అన్నారు. (Story: ఎన్నికలే అజెండాగా ఆరెస్సెస్ కులగణన ప్రకటన)