పోలీసు బెటాలియన్లకు ఎన్డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ
విమర్శలుమాని బాధితులకు భరోసానివ్వండి
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
న్యూస్‌తెలుగు/నిజామాబాద్ : భారీ వర్షాల సమయం, ఇతర అత్యవసర సేవల కోసం పోలీస్ బెటాలియన్ల కు ఎన్డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వనున్నట్టు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ వెల్లదించారు. బుధవారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ముంపు ప్రాంతాల వరద బాధితులను పరామర్శించిన ఆయన ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటున్నానని భరోసా ఇచ్చారు. అనంతరం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహములో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా షబ్బీర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ నగరంలో వరదలు భిభత్సం సృష్టించాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుపేదలే అధిక నష్టానికి గురయ్యారని, వారికి ఆర్థిక సాయం ప్రభుత్వం అందజేస్తుందని భరోసా కల్పిస్తూ అధైర్య పడద్దని సూచించారు. భారీ వర్షాలు వరదల వల్ల పలుచోట్ల నాలలోకి భారీగా నీరు వచ్చి చేరడంతో నాలాలు వరదలతో ఉప్పొంగడంతో లోతట్టు ప్రాంతంలో ఉన్న ఇండ్లలోకి నీరు చేరి రోడ్లు కొట్టుకపోయి భారీ నష్టం జరిగిందన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. బాధితులకు సహాయం అందజేయడంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొనాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ వరద బాధితులకు సహాయక చర్యల్లో ముందు వరుసలో ఉండాలని షబ్బీర్ అలీ కోరారు. భారీ వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉంటూ ప్రాణాలతో పాటు ఆస్తులు కాపాడుకోవాలన్నారు. కలెక్టరేట్ లో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి, కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానం చేయడం జరిగిందని ఆయన అన్నారు. వరద నష్టంపై కేంద్రానికి సమగ్ర నివేదికఇచ్చామని, తక్షణమే కేంద్రం సహాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జాతీయ విపత్తుగా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడం జరిగిందన్నారు. ఎవరు కూడా అధైర్య పడొద్దని, రాష్ట్ర ప్రభుత్వంపై భరోసా ఉంచాలని, ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని షబ్బీర్ అలీ భరోసానిచ్చారు.
ఇలాంటి విపత్కర పరిస్థితిలో ప్రతిపక్షాలు రాజకీయం చేసి బురదజల్లే సమయం కాదని స్పష్టం చేశారు. విమర్శలు చేయడం మాని ప్రజలకు అందుబాటులో ఉండి సహాయం అందించి ఆదుకోవాలని అన్నారు. ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తూ నష్టపోయిన వారిని ఆదుకోవాలే తప్పా రాజకీయ లబ్దికోసం చౌకబారు మాటలు మాట్లాడొద్దన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నగర అధ్యక్షులు కేశ వేణు, నాయకులు రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. (Story : పోలీసు బెటాలియన్లకు ఎన్డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ )