ప్రధాన ఔట్‌పాల్ డ్రెయిన్లలో పూడికలు తీయండి
వీఎంసీ కమిషనర్ హెచ్‌ఎం.ధ్యానచంద్ర
న్యూస్ తెలుగు/`విజయవాడ : నగరంలోని ప్రధాన ఔట్‌పాల్ డ్రెయిన్లలో పూడికలు తొలిగించి రహదారులపైన వర్షం నీరు నిలువకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్‌ఎం.ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ(రెవెన్యూ) సిసోడియా, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ.సృజనతో కలిసి నగరంలోని సున్నబట్టీల సెంటర్ కొండ చర్యలు విరిగిన ప్రాంతాలను పరిశీలించి మొగలరాజపురం మథర్ తెరెసా జంక్షన్, కండ్రిక రాజీవ్ నగర్, నూజివీడు రోడ్‌లో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడున్న ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షం వల్ల రహదారులపై నిలిచిన నీటిని ఎయిర్ టేక్ మిషన్లతో తొలిగించాలని, రోడ్లుపై వర్షం నీరు నిలవకుండా డ్రెయిన్లలో పూడికలు తీసి ప్రధాన అవుట్‌పాల్ డ్రెయిన్లలో ఎలాంటి ఆటంకం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాన ఔట్‌పాల్ డ్రెయిన్లలో పూడికలు తీసేందుకు ఉన్న మెషిన్లనే కాకుండా అవసరమైతే అదనపు మెషిన్లుతో పూడికలు త్వరతగతిన తీసి వర్షం నీరు డ్రెయిన్లలో నిలువకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో వర్షం నీరు నిలువకుండా ఉండేందుకు ఇరిగేషన్ శాఖతో సమన్వయంతో బందర్, రైవస్, ఏలూరు కాలువల్లో వర్షపునీటిని తరలించాలని ఆదేశించారు. అవసరమైతే ఇరిగేషన్ శాఖ సహాయంతో బందరు, రైవస్ కాలువల్లో వదిలే నీటి మట్టాన్ని తగ్గించి నగరంలో కురుస్తున్న వర్షం నీటిని కాలవల ద్వారా తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రజారోగ్యం, ఇంజనీరింగ్ శాఖలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క అధికారి ఫీల్డ్‌లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. జోనల్ కమిషనర్లు తమ పరిధిలో ఉన్న ఎలాంటి సమస్యనయినా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, చెట్లు విరిగిపడిన, రోడ్డుపైన నీటి నిల్వలు ఉన్నా, ప్రజల నుండి ఎలాంటి సమస్య వచ్చినా తక్షణం స్పందించాలని ఆదేశించారు.(Story : ప్రధాన ఔట్‌పాల్ డ్రెయిన్లలో పూడికలు తీయండి)