కౌన్సిలింగు ప్రక్రియతో మహిళా సంరక్షణ పోలీసులకు బదిలీలు
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్
న్యూస్‌తెలుగు/విజయనగరం:
జిల్లాలో వివిధ గ్రామ/వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న మహిళా సంరక్షణ పోలీసులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం కౌన్సిలింగు నిర్వహించి, వారు కోరుకున్న చోటుకు బదిలీలు చేస్తూ, ఉత్తర్వులు జారీ చేసారు. ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారంగా వివిధ సచివాలయాల్లో పని చేసుకున్న మహిళా సంరక్షణ పోలీసులకు వారి యొక్క వ్యక్తిగత, కుటుంబ ఆరోగ్యపరమైన సమస్యలను, భాగస్వామి ఉద్యోగాలను దృష్టిలో పెట్టుకొని, ప్రభుత్వ నిబంధనలు మేరకు ప్రాధాన్యత కల్పిస్తూ బదిలీలు చేపట్టారు. అంతేకాకుండా, ఈ బదిలీలలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి మ్యూచువల్ బదిలీలకు కూడా జిల్లా ఎస్పీ అవకాశం కల్పించారు. కౌన్సిలింగుకు హాజరైన మహిళా సంరక్షణ పోలీసుల సీనియారిటీ ప్రాతిపదికన ఒక్కొక్కరిని జిల్లా ఎస్పీ పిలిచి, వారితో మాట్లాడి, వారి సమస్యలను విని, వాటిని పరిష్కరించే దిశగా వారు కోరుకున్న చోటుకు బదిలీ చేసారు. వివిధ సచివాలయాల్లో ఏర్పడుతున్న ఖాళీలను వివరాలను స్క్రీన్పై చూపుతూ, వారు కోరుకున్న చోటుకు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా బదిలీలు చేయడంతో మహిళా సంరక్షణ పోలీసుల్లో హర్షం వ్యక్తమైంది. జిల్లాలోని వివిధ సచివాలయాల్లో పని చేస్తున్న మహిళా సంరక్షణ పోలీసుల్లో వైద్య పరమైన ఇబ్బందులు, స్పౌజ్ కోటా, దివ్యాంగులకు అత్యధిక ప్రాధాన్యతను కల్పించి, వారిని ముందుగా కౌన్సిలింగుకు పిలవడం జరిగింది. మరి కొంతమంది మహిళా సంరక్షణ పోలీసులకు రిక్వెస్టులను పరిశీలించి, వారిని కూడా వారు కోరుకున్న చోటుకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ బదిలీ చేస్తూ, ఉత్తర్వులు జారీ చేసారు.
ఈ కౌన్సిలింగు ప్రక్రియలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) అస్మా ఫర్హీన్, ఎ.వి.లీలారావు, కార్యాలయ పర్యవేక్షకులు వెంకటలక్ష్మీ, సీనియర్ సహాయకులు తేజ, ఐటి కోర్ టీం ప్రకాశం పాల్గొన్నారు