భూదాన భూములను రక్షించాలి : గిరి ప్రసాద్
న్యూస్‌తెలుగు/వనపర్తి : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భూదాన భూములను రక్షించాలని రాష్ట్రసర్వోదయ మండలి మహబూబ్నగర్ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ గిరిప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. వనపర్తి జిల్లా భూదాన భూములు కన్యాక్రాంతం కాకుండా రక్షించాలని గురువారం సర్వోదయమండలి వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏవో) భాను ప్రకాష్ కు వినతి పత్రం సమర్పించారు. జిల్లా కలెక్టర్కు వినతిపత్రం పంపుతామని భాను ప్రకాష్ చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 41 వేల ఎకరాల భూదాన భూములు ఉండగా, అందులో 10,000 ఎకరాలను పంపిణీ చేశారన్నారు. తక్కిన 31 వేల ఎకరాల్లో పలుచోట్ల భూములు ఆక్రమణలకు గురయ్యాయన్నారు. వాటిని రక్షించేందుకు పలు చర్యలు చేపట్టాలని కోరారు. ధరణి వెబ్సైట్లో ‘భూదాన భూముల’ సర్వే నెంబర్లకు ఎదురుగా ‘భూదాన భూములు’అని నమోదు చేయాలన్నారు. దీనివల్ల ఆ భూములు కొనకుండా అమ్మకుండా అడ్డుకట్ట వేయాలన్నారు. పేదలు దున్నుకుంటున్న భూదాన భూములు మినహా భూస్వాములు ఆక్రమించుకున్న భూములను కలెక్టర్లు స్వాధీనం చేసుకోవాలని కోరారు. గ్రామాల్లో భూదాన భూముల వద్ద ‘భూదాన భూముల’ని ఎమ్మార్వోలు బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. ‘రాష్ట్రభూదాన యజ్ఞం బోర్డు’ ఏర్పాటుకు ప్రతి జిల్లా కలెక్టర్ ప్రతిపాదన పంపాలని రాష్ట్ర సర్వోదయమండలి నిర్ణయించిందన్నారు. అందులో భాగంగా ఉమ్మడి జిల్లా లోని కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తున్నామన్నారు, కలెక్టర్లు ప్రతిపాదనలు పంపితే ‘రాష్ట్ర భూదాన యజ్ఞం బోర్డు’ ఏర్పాటు కు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు. సర్వోదయమండలి జిల్లా అధ్యక్షుడు జే రమేష్, కమిటీ సభ్యుడు కే శ్రీరామ్, గోపాల్, నాయకులు గోపాలకృష్ణ, కాకం బాలస్వామి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.