హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ ను క్రీడాకారులు స్ఫూర్తిగా తీసుకోవాలి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ ను క్రీడాకారులు స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. గురువారం జాతీయ క్రీడల దినోత్సవాన్ని పురస్కరించుకుని వనపర్తి పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలోని హాకీ స్టేడియంలో ఉద్యోగుల స్నేహపూర్వక క్రీడలను ఏర్పాటు చేయగా కలక్టర్ క్రికెట్ బ్యాట్ తో ఆడి క్రీడలు ప్రారంభించారు.
వరుసగా మూడు సార్లు ఒలంపిక్ లో భారత దేశానికి బంగారు పతకం గెలవడంతో ప్రధాన భూమిక పోషించిన హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినం అయిన ఆగష్టు 29న కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటుంది. అందులో భాగంగా వనపర్తి జిల్లాలో యువజన క్రీడా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగుల క్రీడా పోటీలను నిర్వహిస్తుంది. వాలీబాల్, క్రికెట్, చేస్, తాడు లాగుడు పోటీలు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలక్టర్ ముందుగా మేజర్ ధ్యాన్ చంద్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మేజర్ ధ్యాన్ చంద్ ను క్రీడాకారులు స్ఫూర్తి గా తీసుకోవాలని, పట్టుదల, మొక్కవోని ఆత్మవిశ్వాసం అలవర్చుకోవాలని తెలుపుతూ పోటీలో పాల్గొంటున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా యూత్ వెల్ఫేర్ అధికారి సుధీర్ రెడ్డి, ఎస్సి సంక్షేమ శాఖ అధికారి మల్లికార్జున్, వ్యాయామ ఉపాధ్యాయుడు సురేందర్ రెడ్డి క్రీడాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. (Story : హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ ను క్రీడాకారులు స్ఫూర్తిగా తీసుకోవాలి)