మోడీ ప్రభుత్వ పాలనలో రైతాంగం దివాలా!!
రైతాంగం సంఘటితంగా ఉద్యమించాలి
సెప్టెంబరు ఒకటో తేదిన రైతాంగ కోర్కెల దినోత్సవం లో పాల్గొని విజయవంతం చేద్దాం
ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి. ఈశ్వరయ్య
న్యూస్‌తెలుగు/ అమరావతి: దేశంలో మూడో సారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసం పనిచేస్తూ రైతాంగ ప్రయోజనాలను విస్మరించిందని మోడీ ప్రభుత్వ పాలనలో రైతాంగం దివాలా తీశారని రైతాంగం మోడీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతాంగం సంఘటితంగా ఉద్యమించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య సోమవారం ఒక ప్రకటనలో కోరారు
మనదేశ, రాష్ట్ర ఆర్థిక, సాంఘిక, భౌగోళిక పరిస్థితులలో వ్యవసాయం అత్యంత కీలకరంగం. ఇప్పటికీ నూటికి 60 మంది ప్రజలు వ్యవసాయంలోనే జీవనం సాగిస్తున్నారు. దేశంలో 120 కోట్ల మందికి ఆహార భద్రత వ్యవసాయం రంగంపైనే ఆధారపడి ఉంది. వ్యవసాయరంగంలో ఉన్న 72 కోట్ల మంది ప్రజల జీవనస్థాయి పెరిగి కొనుగోలు శక్తి పెరిగితే భారత పారిశ్రామిక రంగం కూడా అభివృద్ధి సాధిస్తుందని, వ్యవసాయరంగాన్ని అభివృద్ధి పరచి దేశాభివృద్ధిని సాధించాలని కాకుండా నయా ఉదారవాద విధానాల ద్వారా రైతాంగ వినాశనం వైపు మోడీ ప్రభుత్వం పయనిస్తోందని ఆయన విమర్శించారు
1991 నుండి సంస్కరణల పేరిట నయా ఉదారవాద ఆర్థిక విధానాలు ప్రవేశ పెట్టారు. వ్యవసాయోత్పత్తుల దిగుమతుల ద్వారాలు తెరవడమే కాక వ్యవసాయరంగంలోకి ప్రత్యక్షంగా విదేశీ పెట్టుబడులు ఆహ్వానించారు. అప్పటివరకు ఉన్న రక్షణ విధానాలను, ఆంక్షలను పూర్తిగా సడలించి విదేశీ కంపెనీలకు మన వ్యవసాయరంగాన్ని అప్పచెప్పారన్నారు.
దేశంలో 80శాతంగా ఉన్న సన్న, చిన్నకారు రైతులకు మిగులు భూములను, బంజరు భూములను పంచి వారికి సాగునీటి వసతి, ఇన్పుట్స్ సబ్సిడీలు, వడ్డీలేని రుణాలు, గిట్టుబాటు ధరలు కల్పించి వ్యవసాయ ఉత్పత్తిని, ఉత్పాదకను పెంచకుండా, అందుకు బదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భూములను, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ రంగానికి కట్టబెట్టడానికి చట్టాలు చేశాయి. అమలుకు పూనుకుంటున్నాయని అందుకు ప్రతిఘటిస్తున్న కోట్లాది మంది సన్న, చిన్నకారు రైతులకు, కౌలు రైతులకు వ్యవసాయ రంగం నుండి, తమ భూమి నుండి పొమ్మనకుండానే పొగ పెట్టినట్లు ఉద్దేశపూర్వకంగా వ్యవసాయాన్ని గిట్టుబాటు కాకుండా చేస్తున్నారని విమర్శించారు.
మోడీ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాల వల్ల వ్యవసాయ రంగం తీవ్ర నష్టాలపాలవుతూ దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయన్నారు.రైతాంగ ఆత్మహత్యల నివారణకు డాక్టర్ m.s. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని కోరారు
రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లకు నివాస గృహాలకు విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియను తక్షణమే నిలపుదల చేయాలని కోరారు.వేలాది కోట్ల రూపాయలు స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజా ధనం దుర్వినియోగం చేస్తున్నారని , తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు తలొగ్గి పోయిందని , గతంలో వ్యతిరేకించిన మీటర్లనే కొనసాగించడం వాగ్దాన బంగమే అవుతోందన్నారు
రాష్ట్రంలో పోలవరం తో పాటు వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలని పాలక ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు
అన్నమయ్య జిల్లాలో నకిలీ విత్తనాలు, నకిలీ నారుతో నష్పపోతున్న రైతాంగాన్ని ఆదుకోవాలని రైతాంగాన్ని మోసం చేస్తున్న నర్సరీ,పర్టిలైజర్స్ యజమానులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు
రైతాంగం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబరు ఒకటో తేదీన జరిగే రైతాంగం కోర్కెల దినోత్సవంలో రైతాంగం పాల్గొని విజయవంతం చేయాలని కోరారు (Story : మోడీ ప్రభుత్వ పాలనలో రైతాంగం దివాలా!!)