వార్డు పర్యటనలో మున్సిపల్ కమిషనర్ ఎం ఎ నాయుడు
న్యూస్‌తెలుగు/విజయనగరం : విజయనగరం నగరంలోని 5,6వ నెంబర్ సచివాలయం ప్రాంతంలో జరిగిన వార్డు పర్యటనలో కమిషనర్ ఎంఎం నాయుడు పాల్గొన్నారు. ద్వారకానగర్, బాబా మెట్ట, శివపంచాయతీ ఆలయం తదితర ప్రాంతాలలో పర్యటించి స్థానికుల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఆయా ప్రాంతాలలో ఏర్పాటు అయిన సిసి రోడ్ల పరిధిలో కాలువల సరిగా లేవని ప్రజలు అధికారులు దృష్టికి తెచ్చారు. అనంతరం అంగన్వాడి కేంద్రాన్ని కమిషనర్ పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న ప్రాధమిక విద్యను గమనించారు. కమిషనర్ అడిగిన ప్రశ్నలకు పిల్లలు సరైన సమాధానాలు చెప్పడంతో అభినందించారు. అంగన్వాడి సిబ్బందిని ప్రశంసించారు.అలాగే సమీపంలో ఉన్న కళ్యాణ భారతి బాలికల పాఠశాలకు వెళ్లి మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని స్వీకరించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ప్రతి గురువారం ఒక్క డివిజన్ చొప్పున పర్యటనలు చేపడుతున్నామన్నారు. ప్రజల నుండి స్వీకరించిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. స్థానిక కార్పొరేటర్ గాదం మురళి మాట్లాడుతూ తమ డివిజన్ లో అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని అధికారులు దృష్టికి తెచ్చామని చెప్పారు. నిధులు లభ్యతను బట్టి ప్రాధాన్యత క్రమంలో నిర్మాణ పనులు చేపట్టేందుకు అధికారులు సమ్మతించడం ఆనందమని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి, ఈ ఈ కే. శ్రీనివాసరావు,టౌన్ ప్లానింగ్ అధికారులు, ప్రజారోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. (Story : వార్డు పర్యటనలో మున్సిపల్ కమిషనర్ ఎం ఎ నాయుడు )