యువతకు ఉద్యోగల జోష్
న్యూస్ తెలుగు/అమరావతి: కూటమి ప్రభుత్వ యువతకు ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు. అనుకున్నట్లుగానే భారీ మెజార్టీలతో కూటమి గెలుపుతో ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. సోమవారం ఫాక్స్ కాన్ ప్రతినిధులతో ఉండవల్లిలోని తన నివాసమంలో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. కంపెనీ ప్రతినిధులకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలపై మంత్రి చర్చించారు. సీఎం చంద్రబాబు చొరవతో 2014 నుంచి 2019 వరకు చాలా కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని లోకేశ్ చెప్పారు. అందులో ఫాక్స్ కాన్ కూడా ఒకటని పేర్కొన్నారు. 14 వేల మంది మహిళలకు నాడు ఈ కంపెనీ ద్వారా ఉద్యోగాలు కల్పించారని గుర్తుచేశారు. ఇప్పుడు ఫాక్స్ కాన్ ఇండియా తన కార్యకలాపాలను విస్తరించాలని చూస్తోందని, అందులో భాగంగా కేవలం ఒక ప్లాంట్ ఏర్పాటు చేయడం కాకుండా.. ఫాక్స్ కాన్ మెగా మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ నిర్మాణం ఇక్కడ నిర్మించాలని ఆ కంపెనీ ప్రతినిధులను లోకేష్ కోరారు. ఫాక్స్ కాన్ మెగా సిటీ ఏర్పాటుకు అవసరమైన పూర్తి సహకారం తాము అందిస్తామన్నారు. తమ ప్రభుత్వంలో యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ లక్ష్య సాధనలో ఫాక్స్ కాన్ ప్రదాన భూమిక పోషించాలని వారికి విజ్ఞప్తి చేశారు. అనుమతుల నుండి ఉత్పత్తి వరకూ ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు రాష్ట్రంలో ఫాక్స్‌కాన్ ఏర్పాటైతే నిరుద్యోగ యువతకు పుష్కలంగా ఉద్యోగాలు లభిస్తాయి. ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లాల్సిన అవసరం లేదు. (Story : యువతకు ఉద్యోగల జోష్)