ఏపీకి మరో 15వేల ఉద్యోగాల జాతర
న్యూస్ తెలుగు-అమరావతి: ఏపీకి ఉద్యోగాల జాతర ఆరంభం కానుంది. హెచ్‌సీఎల్ కంపెనీ ద్వారా 15వేల ఉద్యోగాల కల్పనకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రణాళిక రూపొందించారు. ఏపీలో 20లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంతో ఉన్న కూటమి ప్రభుత్వం ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. మంగళవారం మంత్రి లోకేష్‌తో హెచ్‌సీఎల్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ శివశంకర్, అసోసియేటెడ్ వైస్ ప్రెసిడెంట్ శివప్రసాద్ భేటీ అయ్యారు. ఐటీలో ప్రపంచ స్థాయిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా భారీ స్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. మంత్రి లోకేశ్, హెచ్‌సీఎల్ ప్రతినిధుల భేటీ సానుకూలంగా కొనసాగింది.ఈ క్రమంలో 15వేల ఉద్యోగల కల్పనకు మార్గం సుగమం కానుంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోను హెచ్‌సీఎల్ కార్యకలాపాలను ప్రారంభించి, 4,500 మందికి ఉద్యోగవకాశాలను కల్పించింది. ఈ విడత రెండు విడతలుగా 15వేల మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తామని హెచ్‌సీఎల్ స్పష్టంచేసింది. ఇది ఏపీ నిరుద్యోగులకు శుభవార్త కానుంది. మంత్రి లోకేష్ చొరవ, కృషితో డిగ్రీలు పూర్తి చేసిన నిరుద్యోగులకు సొంత రాష్ట్రంలోనే ఉద్యోగాల కల్పనకు మార్గం ఏర్పాటు కానుంది. (Story : ఏపీకి మరో 15వేల ఉద్యోగాల జాతర)