సహాయ చర్యలపై అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి
సత్వర సహాయక చర్యలపై అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే జీవీ
న్యూస్‌తెలుగు/వినుకొండ : భారీ వర్షాలు, వరదపరిస్థితుల నేపథ్యంలో సహాయ చర్యలపై అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సూచించారు. వరద నష్టం, సత్వర సహాయక చర్యలపై ఆదివారం హైదరబాద్ నుంచి అధికారులతో ఆయన సమీక్ష చేశారు. వ్యవసాయం, రెవెన్యూ, పంచాయతీరాజ్, జలవనరులు, విద్యుత్, పోలీస్ సహా పలు శాఖల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఎప్పడికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. రైతులకు పంటనష్టం విషయంలో వేగంగా స్పందించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవీ వ్యవసాయ అధికారులకు సూచించారు. పంటలపై వర్షాల ప్రభావం, రైతుల పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంచాయతీరాజ్ అధికారులు గ్రామాల్లో సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరీ ముఖ్యంగా మంచినీరు, పారిశుద్ధ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. వైద్యారోగ్య విభాగం అధికారులు ప్రస్తుతం ప్రబలుతున్న విషజ్వరాలపై పూర్తి సన్నద్ధతో ఉండాలని ఆదేశించారు. జ్వరబాధితులు, అనారోగ్యంతో వచ్చే వారికి అన్ని వేళలా వైద్యసేవలు అందేలా ఏర్పాటు చేయాలన్నారు. వైద్యులు లేరు, మందులు లేవు అన్న మాట రాకూడదని, అవసరమైన అన్నీ సమకూర్చి పెట్టుకోవాలని సూచించారు. గ్రామాల్లో వైద్య శిబిరాల నిర్వహణ అంశాన్ని కూడా పరిశీలించాలన్నారు. పంచాయతీరాజ్, ఆర్&బీ శాఖల పరిధిలో ఎక్కడైనా రోడ్లు దెబ్బతిని ఉంటే తక్షణం మరమ్మతులు చేపట్టాలన్నారు. ఎక్కడా రాకపోకలకు అంతరాయం ఉండకూడదని… ప్రజల ఫిర్యాదులపై విద్యుత్ విభాగం అధికారులు వేగంగా స్పందించాలన్నారు. అలానే రెవెన్యూ విభాగం తరఫున సహాయ చర్యలకు సమన్వయం చేసుకోవాలని తహసీల్దార్లకు సూచించారు. స్థానికంగా దెబ్బతిన్న నీటి వనరుల వివరాలు సేకరించి అవసరమైన చర్యలకు జలవనరుల శాఖ విభాగం కూడా సన్నద్ధంగా ఉండాలని తెలిపారు. ఒక వేళ ఎక్కడైనా సమస్య పెద్దది అయితే వెంటనే తన దృష్టికి తీసుకుని రావాలని సూచించారు. (Story :సహాయ చర్యలపై అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి)