UA-35385725-1 UA-35385725-1

ఆరునెలల ముందే భోగాపురం విమానాశ్రయం పూర్తి

ఆరునెలల ముందే భోగాపురం విమానాశ్రయం పూర్తి

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు

ఎయిర్పోర్ట్ నిర్మాణ పనుల పరిశీలన

న్యూస్‌తెలుగు/భోగాపురం, (విజయనగరం) : నిర్ణీత సమయానికి ఆరు నెలల ముందే భోగాపురం విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేస్తామని, కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. రాష్ట్ర మంత్రులు గుమ్మిడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ తో కలిసి ఆయన ఆదివారం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న టెర్మినల్ భవనం, రన్ వే, ఎటీసీ టవర్, ఇతర భవనాలను పరిశీలించారు. జిల్లా అధికారులు, జిఎంఆర్, ఎల్ అండ్ టి ప్రతినిధులతో విమానాశ్రయ నిర్మాణం పై సమీక్షించారు.
అనంతరం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ, నిర్మాణ పనులు శర వేగంగా జరుగుతున్నాయని తెలిపారు షెడ్యూల్ ప్రకారం 2026 డిసెంబర్ నాటికి ఎయిర్పోర్ట్ పూర్తి కావాల్సి ఉందని, కానీ ప్రస్తుత పనుల తీరును బట్టి ఆరు నెలల ముందుగా 2026 జూన్ నాటికే విమానాశ్రయం సిద్ధమవుతుందని చెప్పారు. ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చే ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని, ఈ ప్రాంత వాసిగా తాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నానని వెల్లడించారు. ఉత్తరాంధ్రలో కూటమికి అఖండ మెజారిటీ ఇచ్చారని, ఈ ప్రాంత ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. అందుకే వీలైనంత వేగంగా భోగాపురం విమానాశ్రయాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆదర్శంగా తీసుకొని, భోగాపురం విమానాశ్రయాన్ని త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రతినెలా విమానాశ్రయ నిర్మాణాన్ని పరిశీలించి, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తానని ప్రకటించారు.
గత నెల 11వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమానాశ్రయాన్ని సందర్శించేనాటికి 31.8% పనులు జరిగాయని, ప్రస్తుతం 36.6% పూర్తయిందని తెలిపారు. శర వేగంగా జరుగుతున్న పనుల తీరుని బట్టి ఈ విమానాశ్రయం నిర్మాణం ఆరు నెలల ముందే పూర్తవుతుందని నమ్మకం తమకు కలిగిందని అన్నారు. జూలై 11 నాటికి మట్టి పనులు 97.3% పూర్తికాగా, ఈరోజుకి 98% పూర్తయ్యాయన్నారు. గత నెలతో పోలిస్తే రన్ వే నిర్మాణ పనులు 32 శాతం నుంచి 38.67 శాతానికి, టాక్సీ వే పనులు 16.7% నుంచి 20.78 శాతానికి, టెర్మినల్ నిర్మాణ పనులు 22.5% నుంచి 27.28% పూర్తయ్యాయని తెలిపారు. అదేవిధంగా ఏటీసి టవర్ నిర్మాణ పనులు 25.58% నుంచి 30.69 శాతానికి పూర్తయ్యాయని, అదనంగా 12 మీటర్ల ఎత్తు నిర్మించడం జరిగిందని చెప్పారు. అలాగే ఇతర భవనాలు, సబ్ స్టేషన్లు, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, తదితరు పనులు 6 నుంచి 12 శాతానికి పెరిగాయన్నారు. లక్ష్యానికి అనుగుణంగా పనులు నిర్వహిస్తున్న జిఎంఆర్, ఎల్ అండ్ టి కంపెనీలను మంత్రి అభినందించారు. ముఖ్యంగా గత నెల రోజుల్లో విపరీతంగా వర్షాలు పడినప్పటికీ, ముందస్తు ప్రణాళికతో పనులు ఎక్కడా ఆగకుండా నిర్వహించడం అభినందనీయమని అన్నారు.
దేశంలో విమానయాన రంగం ఏటా 16% వృద్ధితో ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా విమానాశ్రయాలకోసం డిమాండ్ పెరుగుతోందని మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి మోడీ ఎంతో దూర దృష్టితో కప్రవేశపెట్టిన ఆర్సిఎస్ ఉడాన్ స్కీము ఈ రంగం అభివృద్ధికి ఎంతో ఊతమిచ్చిందని చెప్పారు. భారత విమానయాన రంగం ప్రపంచంలో ఉన్నతమైనదిగా అడుగులు వేస్తోందని చెప్పారు. ముంబై సమీపంలోని నవీ ముంబై ఎయిర్పోర్ట్, నోయిడా సమీపంలోని జీవన్ ఎయిర్పోర్ట్ లను ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా చాలా చోట్ల విమానాశ్రయాలను నిర్మించాల్సి ఉందని, అవసరమైన భూమి, సాంకేతిక అంశాలు అనుకూలిస్తే వీటిని చేపడతామని తెలిపారు. సీ పోర్టుల్లాగే ఎయిర్పోర్టులను కూడా అభివృద్ధి చేయాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా మూలపేట ధగదర్తి, నాగార్జునసాగర్, కుప్పం వద్ద కూడా విమానాశ్రయ నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. అదే విధంగా అనంతపురం, ఒంగోలులో కూడా విమానాశ్రయం నిర్మించాలని ఆ ప్రాంతవాసులు అడుగుతున్నట్లు తెలిపారు. వీటి కోసం కనీసం 1000 నుంచి 1500 ఎకరాల భూమి ఉంటే తప్ప ఎయిర్పోర్ట్ను ప్రతిపాదించలేమని తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో వరంగల్, అదిలాబాద్, రామగుండం వద్ద కూడా విమానాశ్రయాల కోసం ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారని తెలిపారు. కేంద్ర క్యాబినెట్లో వయసు రీత్యా తాను అత్యంత చిన్నవాడినైనప్పటికీ, గొప్ప దార్శనికత ఉన్న ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబుల స్ఫూర్తితో విమానం రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నానని మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో గత ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని, కావాల్సిన భూములను అప్పగించలేదని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రైల్వే జోన్ పనులను వేగవంతం చేశామని, సుమారు 52.5 ఎకరాల భూమిని, కావలసిన ఇతర అనుమతులు కూడా మంజూరు చేస్తున్నామని అన్నారు. రైల్వే జోన్ ఏర్పాటు కూడా ముఖ్యమంత్రికి ప్రాధాన్యత అంశంగా మారిందని తెలిపారు. చంద్రబాబు నాయుడు కూడా ఇటీవలే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారని, త్వరలో పనులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. భోగాపురం విమానాశ్రయానికి విశాఖ వైపు నుంచే ఎక్కువగా ప్రయాణికులు వచ్చే అవకాశం ఉందని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా జాతీయ రహదారిపై 12 చోట్ల మార్పులు చేయాల్సి ఉందని చెప్పారు. దీనికోసం నేషనల్ హైవే అథారిటీతో కూడా మాట్లాడుతున్నామని తెలిపారు. బీచ్ రోడ్ అభివృద్ధి కూడా ఒక ప్రత్యామ్నాయంగా యోచిస్తున్నట్లు వెల్లడించారు. విజయనగరం జిల్లా ప్రజా ప్రతినిధుల కోరిక మేరకు, జొన్నాడ టోల్ గేట్ ను తరలించే విషయంపై, సంబంధిత అధికారులతో మాట్లాడతామని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు.
ఈ పర్యటనలో రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, ఆర్డిఓ ఎంవి సూర్య కళ, జి.ఎం.ఆర్.గ్రూప్ సంస్థల డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఐ. ప్రభాకరరావు, సిఇఓ మన్మో య్ రాయ్, ప్రాజెక్టు హెడ్ రామరాజు, ఇతర ప్రతినిధులు, అధికారులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు. (Story : ఆరునెలల ముందే భోగాపురం విమానాశ్రయం పూర్తి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1