జిల్లాలో గంజాయి, నాటుసారా నిర్మూలనకు విస్తృత దాడులు చేపట్టాలి
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్
న్యూస్‌తెలుగు/విజయనగరం : జిల్లాలో గంజాయి, నాటుసారా నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టి, వాటి నిర్మూలనకు విస్తృత దాడులు చేపట్టాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎస్ఈబి అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మట్లాడుతూ – గ్రామ స్థాయిలో గంజాయి, నాటుసారా మరియు ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలన్నారు. గంజాయి, నాటుసారా తయారీ, రవాణా, అమ్మకాలను నియంత్రించేందుకు గ్రామ స్థాయిలో ప్రత్యేక దృష్టి సారించి నిఘా ఏర్పాటు చేసుకోవాలన్నారు. సారా తయారీకి, అమ్మకాలకు అలవాటుపడిన నిందితులను జిల్లా వ్యాప్తంగా గుర్తించి, వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని, నాటుసారా అమ్మకాలు, తయారీకి పాల్పడకుండా ఉండేందుకు వారిపై బైండోవరు కేసులు నమోదు చేయాలన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో నాటుసారా తయారీ, గంజాయి అక్రమ రవాణాపై క్షేత్ర స్థాయిలో నిఘా పెట్టాలని ఆధికారులను ఆదేశించారు. మారుమూల ప్రాంతాల్లో బెల్లం ఊటలను గుర్తించి, ధ్వంసం చేసే కేసుల్లో నిందితులను గుర్తించాలని, వారిపై చర్యలు చేపట్టాలన్నారు. గతంలో గంజాయి, నాటుసారా అక్రమ రవాణలో అరెస్టుకాబడిన నిందితులను విచారణ చేసి, అక్రమ రవాణ మూలాలను గుర్తించి, అందుకు బాధ్యులైన వారిని కూడా ఆయా కేసుల్లో నిందితులుగా చేర్చాలని ఆదేశించారు. గ్రామా స్థాయిలో బెల్టుషాపులపై అకస్మిక దాడులు నిర్వహించి ఎన్ఫోర్స్మెంట్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాపై నిఘా ఏర్పాటు చేసి కేసులు నమోదు చేయాలన్నారు. దర్యాప్తులో ఉన్న కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్లను ఎక్జిక్యూట్ చేయాలని ఆదేశించారు. దర్యాప్తులో ఉన్న కేసుల్లో దర్యాప్తును వేగవంతంగా పూర్తిచేసి, కోర్టులో నిందితులపై అభియోగ పత్రాలను దాఖలు చేయాలని ఎస్ఈబి అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ ఆస్మా ఫర్హీన్, అసిస్టెంట్ కమీషనరు, ఎన్ఫోర్సుమెంటు సూపరింటెండెంట్లు మరియు ఇతర ఎస్ఈబి అధికారులు పాల్గొన్నారు. (Story : జిల్లాలో గంజాయి, నాటుసారా నిర్మూలనకు విస్తృత దాడులు చేపట్టాలి)