Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ బాబు గారూ!…చేనేతను బతికించండి

బాబు గారూ!…చేనేతను బతికించండి

0

బాబు గారూ!…చేనేతను బతికించండి

 టెక్స్ టైల్ పార్క్ వద్దు – హ్యాండ్ లూమ్ పార్క్ కావాలి
మాస్టర్ వీవర్ అభివృద్ధి చేనేత అభివృద్ధి కాదు.

న్యూస్‌తెలుగు/చీరాల: నేడు చీరాలలో జరుగుతున్న చేనేత సదస్సు చేనేత అభివృద్ధి పేరుతో జరుగుతున్న ముసుగు కార్యక్రమం మాత్రమే. నియోజకవర్గంలోని చేనేత కార్మికుల మీద ఆర్థిక, రాజకీయ పెత్తనాన్ని నిలబెట్టుకుని దోపిడీ చేస్తున్న మాస్టర్ వీవర్స్ వర్గం తాలూకు నిలిచిపోయిన 43 కోట్ల రూపాయల సరుకును( సరుకు అనగా మాస్టర్ వీవర్స్ చేతి మగ్గాల మీద కార్మికుల చేత నేయించిన చీరలు తాలూకు 43 కోట్ల రూపాయల సరుకు అని అర్ధం) ఆప్కో ద్వారా కొనుగోలు చేయించి మాస్టర్ వివర్స్ కు ఆదాయం కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నమే చీరాలలో జరుగుతున్న చేనేత సదస్సు. ఈ విషయాన్ని చీరాల నియోజకవర్గంలోని చేనేత కార్మికులే కాకుండా యావత్తు రాష్ట్రంలోని చేనేత కార్మికులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజాయితీగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారు నేరుగా చేనేత కార్మికులను కలిసి వాళ్ళ సాధక బాధలు వింటే చేనేత కార్మికులకు ఏమి చేయాలో నేరుగా అర్థమవుతుంది. చేనేతపురిలో జరుగుతుంది అనుకున్న చేనేత సదస్సు 24 గంటలసేపు దోబూచులాడి చివరకు జాండ్రపేట హైస్కూల్ కు మార్చబడింది.ఈ మార్పు వెనక మాస్టర్ వీవర్స్ మైండ్ గేమ్ ఫలితమని చేనేత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాస్టర్ వీవర్స్ దగ్గర ఉన్న చేనేత ఉత్పత్తులను అమ్మకాలు చేయడం ద్వారా చేనేత కార్మికులకు రోజు వారి పని కల్పిస్తారని చేనేత కార్మికులు భావించారు. కానీ ఆ పరిస్థితి చీరాల ప్రాంతంలో లేదు. కొన్ని దశాబ్దాలుగా చేనేత కార్మికులు మాస్టర్ వీవర్స్ దగ్గర పని చేస్తున్నప్పటికీ కష్ట కాలంలో ఆదుకున్నటువంటి దాఖలాలు గత 30 సంవత్సరములుగా కనిపించడం లేదు. ఎంతో నైపుణ్యంతో చేనేత కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి ప్రపంచం మెచ్చే చేనేత ఉత్పత్తులను తయారు చేస్తుంటే, వారి సంక్షేమాన్ని మరిచిన మాస్టర్ వీవర్స్ ఇతర రాష్ట్రాల నుంచి పవర్ లూమ్ చీరలను దిగుమతి చేసుకొని వాటిని చేనేత ఉత్పత్తుల పేరుతో అమ్మకాలు చేయడం తల్లి పాలు తాగి రొమ్మును గుద్దిన చందంగా ఉంది. అంటే వారి వ్యాపారాలకోసం, ఆదాయాలకోసం తల్లి లాంటి చేనేతవృత్తిని నాశనం చేయడానికి కూడా మాస్టర్ వీవర్స్ వెనుకాడరని గత చరిత్ర స్పష్టం చేసింది. చీరాల లో ఏర్పాటు చేయాల్సింది టెక్స్ టై పార్క్ కాదు, హ్యాండ్ లూమ్ పార్క్ ఏర్పాటు వాళ్ళ చేనేత కార్మికులకు పని భరోసా, చేనేత పరిశ్రమ భరోసా ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది. టెక్స్ టై పార్క్ ఏర్పాటు చేస్తే, మాస్టర్ వీవర్ అభివృద్ధి మాత్రమె జరుగుతుంది. అందువల్ల చేనేత కార్మికులు, పరిశ్రమ అభివృద్ధి కాదు. గతంలో చేనేత కార్మికులకు నెలకు 26 నుండి 27 రోజులుగా ఉన్న పని దినాలు నేడు 12 నుండి 15 రోజులకు పరిమితం చేసిన మాస్టర్ వీవర్స్ చేనేత కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. అంటే దాదాపు నెలకి 10 నుండి 12 రోజులు పని దినాలను చేనేత కార్మికులు కోల్పోతున్నారు. చేనేత కార్మికుల యొక్క సంక్షేమాన్ని మరిచి స్వలాభము, సొంత వ్యాపారాల మీద దృష్టిపెట్టిన మాస్టర్ వీవర్స్ భవిష్యత్తులో కూడా చేనేత కార్మికులకు ఏవిధంగా పని కల్పిస్తారనే భరోసాని నేటికీ ఇవ్వలేకపోతున్నారు. అందువల్ల ప్రభుత్వమే బాధ్యత తీసుకొని చేనేత కార్మికులకు రోజువారి పనిని కల్పించడం కోసం చీరాల ప్రాంతంలో ఉత్పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చేనేత కార్మికులు, చేనేత పరిశ్రమను కాపాడాలని కార్మికులు కోరుతున్నారు (Story : బాబు గారూ!…చేనేతను బతికించండి )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version