ప్రజా యుద్ధనౌక గద్దర్ కన్నుమూత
హైదరాబాద్: ప్రజా యుద్ధనౌకగా పేరుపొందిన ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న గద్దర్.. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు.
గద్దర్ మరణవార్తను ఆయన కొడుకు సూర్యం ధృవీకరించారు. ప్రజా గాయకుడు గద్దర్ మరణవార్తతో ఆయన అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. కాగా, 1949 జూన్ 5న తూప్రాన్‌లో జన్మించిన గద్దర్.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో క్రియా శీలక పాత్ర పోషించారు. తన పాటలతో ఉద్యమాలకు ఊపుతెచ్చారు. ఉద్యమంలో తన పాటతో ఎంతోమందిని ఉత్తేజపరిచారు. ఆయన మరణంతో తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా విషాదం నెలకొన్నది.
గద్దర్ గా అందరికీ సుపరిచితమైన గుమ్మడి విఠల్ రావు (1949 – 2023, ఆగస్టు 6) విప్లవ కవి. ఈయనకు గద్దర్ అను పేరును స్వాతంత్య్రం రాకముందు బ్రిటిష్ రాజ్యాన్ని వ్యతిరేకించిన గదర్ పార్టీకి గుర్తుగా తీసుకోవడం జరిగింది.
గద్దర్ మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1948లో దళిత కుటుంబంలో జన్మించాడు. విద్యాభ్యాసం నిజామాబాదు జిల్లా మహబూబ్ నగర్ లో, ఇంజనీరింగ్ విద్య హైదరాబాద్ లో జరిగింది. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నాడు. భావ వ్యాప్తికోసం ఆయన ఊరురా తిరిగి ప్రచారం చేసారు. దీనికొరకు ఆయన బుర్రకథను ఎంచుకున్నాడు. ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి.నరసింగరావు భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శనను ఏర్పాటు చేసారు. ఆతర్వాత ప్రతి ఆదివారం ఆయన తన ప్రదర్శనలు ఇచ్చే వాడు. 1971 లో బి.నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట “ఆపర రిక్షా” రాశాడు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది.
కుటుంబ నియంత్రణ, పారిశుధ్యం వంటి అనేక సామాజిక విషయాల గురించి ఆయన బుర్రకథలను తయారు చేసుకొని ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించేవాడు. ఆ తర్వాత అతను అనేక పాటలు రాసాడు. 1972 లో పల్లెల్లో జరుగుతున్న ఆకృత్యాలను ఎదురించేందుకు జన నాట్య మండలి ఏర్పడింది. ఇది దళితులను మేల్కొలిపేందుకు, వారిని చైతన్య పరిచేందుకు ఏర్పడింది. అయితే 1975లో గద్దర్ బ్యాంకు రిక్రూట్ మెంట్ పరీక్షను రాసాడు. అయన కెనరా బ్యాంకులో క్లార్క్ గా చేరాడు, తర్వాత అతను విమలను వివాహం చేసుకున్నాడు. వారికి ముగ్గురు పిల్లలు, సూర్యుడు, చంద్రుడు ( 2003 లో అనారోగ్యంతో మరణించారు), వెన్నెల.
మాభూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించి యాదగిరి పాడిన బండెనక బండి కట్టి అనే పాటను ఆయనే పాడి, ఆడాడు. 1984 లో ఆయన క్లార్కు ఉద్యోగానికి రాజీనామా చేసాడు. 1985 లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడాడు. జన నాట్య మండలిలో చేరాడు. ఒగ్గు కథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథ ల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి వెళ్ళాడు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, బీహార్ రాష్ట్రాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు. కింద గోచి ధోతి, పైన గొంగళి ధరించేవాడు. ఆయన పాడే పాటలకు ప్రజల్లో చైతన్యం కలిగిస్తుంటాయి. దళిత పేదలు అనుభవిస్తున్న కష్ట, నష్టాలను ఆయన, ఆయన బృందం కళ్ళకు కట్టినట్టుగా పాటలు, నాటకాల రూపంలో తెలియ జెప్పేవారు. ఆయన పాటలు వందలు, వేలు కాసెట్ లు గా, సిడిలుగా రికార్డ్ అయ్యి అత్యధికంగా అమ్ముడుపోయాయి.
మర్రి చెన్నారెడ్డి రెండవసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నక్సలైట్స్ పై ఆయన ఉదారంగా వ్యవహరించాడు, వారిపై నిషేధం ఎత్తి వేయబడింది. 1990 ఫిబ్రవరి 18 న జన నాట్య మండలి ఆధ్వర్యంలో గద్దర్ హైదరాబాద్ లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించిన భారి భహిరంగ సభకు 2 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు.
1997 ఏప్రిల్ 6 న ఆయన పై పోలీసులు విరుచుకు పడ్డారు. ఆయన శరీరంలోకి అనేక బుల్లెట్లు గుచ్చుకున్నాయి. అన్ని బుల్లెట్ లను తొలగించారు కాని ఒక్క బుల్లెట్ ను మాత్రం డాక్టర్ లు తొలగించలేదు. అది తొలగిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదమని వదిలేశారు. ఆయన ఒంట్లో బుల్లెట్ ఉంది.ఆ తర్వాత నక్సలైట్ పార్టీలో ఉంటూ విప్లవ సాహిత్యాన్ని ప్రజల ముందు ఉంచారు. విప్లవ రచయితల సంఘం ద్వారా ప్రజలను చైతన్య పరిచారు. 2002 లో ప్రభుత్వంతో చర్చల సమయంలో నక్సలైట్స్ గద్దర్, వరవరరావు లను తమ దూతలుగా పంపారు. నకిలీ ఎన్కౌంటర్ లను ఆయన తీవ్రంగా నిరసించాడు.
తెలంగాణ ఉద్యమం పునరుద్ధరించడంతో, గద్దర్ మరోసారి వెనుకబడిన కులాలు, నిమ్న కులాల ఉద్ధరణ ఉద్దేశంతో ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం తన మద్దతును తెలపటానికి ప్రారంభించాడు. బలమైన కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నప్పటికీ, అతను ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని వ్యతిరేకించే భారతదేశం లోని కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలతో తన భావాలను పంచుకోలేదు.
గద్దర్ మొదటి నుండి తెలంగాణా వాదే. మావోయిస్టు పార్టీ తెలంగాణాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా ఆయన తెలంగాణకే మద్దతు తెలిపారు. దేవేందర్ గౌడ్ నవ తెలంగాణా పార్టీ పెట్టినప్పుడు ఆయనకు కూడా మద్దతు తెలిపారు గద్దర్. గద్దర్ పై దాడి జరిగినప్పుడు హోం మినిస్టర్ దేవేందర్ గౌడ్. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణా ప్రజా ఫ్రంట్ ను స్థాపించారు.
సినిమారంగంలోనూ ఆయన ఖ్యాతి గడించారు.
మాభూమి సినిమాలోని బండెనక బండి కట్టి అనే పాటను పాడడంతోపాటు పాటలో నటించారు. ఆయన రాసిన పాటల్లో “అమ్మ తెలంగాణమా” అనే పాట బహుల ప్రజాదరణ పొందింది. తెలంగాణా లోని అన్ని అంశాలను స్పృశిస్తూ సాగింది ఈ పాట. ఆయన రాసిన “నీ పాదం మీద పుట్టు మచ్చ నై చెల్లెమ్మ” అనే పాటకు ఉత్తమ గీతంగా నంది అవార్డు వచ్చింది అయితే ఆయన ఆ అవార్డును తిరస్కరించారు. ఆయన మరోసారి జై బోలో తెలంగాణా సినిమాలో తెరపైన కనిపించాడు. ‘పొడుస్తున్న పొద్దూ’ మీద పాట ఆయనే రాసి పాడి, అభినయించారు. ఈ పాట అద్భుత విజయం సాధించింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో తీసిన ఉక్కు సత్యాగ్రహం అనే సినిమాలో గద్దర్ కీలకపాత్ర పోషించారు. ఇదే గద్దర్ నటించిన చివరి సినిమా.
అమ్మ తెలంగాణ, మల్లెతీగ కు పందిరి వోలె, పొడుస్తున్న పొద్దు మీద వంటి పాటలు ప్రజాదరణ పొందాయి. అవి ప్రజల నోళ్లల్లో ఎప్పటికీ నానుతూ వుంటాయి. అలాగే, 1995లో ఒరేయ్ రిక్షా సినిమాలోని మల్లెతీగ కు పందిరి వోలె పాటకు ఉత్తమ గీతంగా నంది అవార్డు లభించింది. కానీ ఆయన ఆ అవార్డును తిరస్కరించాడు. అలాగే, 2011లో ఉత్తమ నేపథ్య గాయకులుగా జై బోలో తెలంగాణ సినిమాలోని “పొడుస్తున్న పొద్దు మీద” పాటకు నంది అవార్డు వచ్చింది. ఈశ్వరీబాయి మెమోరియల్ సెంచరీ అవార్డు కూడా ఆయనకు లభించింది.
మరణం
గుండెపోటు కారణంగా 2023 జూలై 20న హైదరాబాద్, అమీర్ పేట్ లోని అపోలో ఆసుపత్రిలో చేరిన గద్దర్ కు ఆగస్టు 3న వైద్యులు బైపాస్ సర్జరీ చేశారు. తరువాత ఆసుపత్రిలోనే చికిత్సపొందిన గద్దర్ ఊపిరితిత్తులు, యూరినరీ సమస్యలతో 2023, ఆగస్టు 6న మధ్యాహ్నం 3 గంటలకు మరణించారు. (Story: ప్రజా యుద్ధనౌక గద్దర్ కన్నుమూత)
See Also
హంతకుడుగా ముద్రపడిన కెప్టెన్ మిల్లర్!
కన్నీళ్లు ఆరకముందే… మళ్లీ వరద!
హీరో నితిన్‌కు ఎక్స్‌ట్రాలు ఎక్కువే!
షూటింగ్లో ఉపవాసం చేసిన పవర్‌స్టార్!
మెగాస్టార్ ‘భోళా శంకర్’ ‘మిల్కీ బ్యూటీ’ పాట వచ్చేసింది!
చికెన్ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం
వివేకా హత్య కేసులో ఆ నివేదికలే కీలకం!
షాకింగ్ న్యూస్: హీరో అబ్బాస్ ఇప్పుడు కారు డ్రైవరా?
బిగ్‌బాస్ సొహైల్‌కు కడుపొచ్చింది!
‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్
https://www.youtube.com/@abtimes106