క్యాబినెట్ విస్తరణ ముహూర్తం కుదిరింది!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో చేర్పులు మార్పులకు రెండు వారాలే వుంది. ఏప్రిల్ 11వ తేదీన ఏపీ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టవచ్చని సచివాలయ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర మంత్రిమండలి ఏప్రిల్ 7న సమావేశమైన తర్వాత ప్రస్తుత మంత్రివర్గ సభ్యుల భవితవ్యం ఏమిటన్నది తేలుతుంది. రెండున్నరేళ్ళ తర్వాత కొత్త క్యాబినెట్ వస్తుందని ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాడే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఇప్పటివరకు సీఎంగా తీసుకున్న ఏ నిర్ణయంపైనా వెనక్కి తగ్గని జగన్ ఈ విషయంలో నిర్ణయం మార్చుకుంటారని భావించలేం. క్యాబినెట్‌లో కొత్తవారికి చోటివ్వడమనేది కచ్చితంగా జరిగి తీరుతుందని ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు (సలహాదారులు) తెలిపాయి. క్యాబినెట్ పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో ఏప్రిల్ 7వ తేదీ గురువారంనాడు మంత్రివర్గ సమావేశాన్ని సీఎం ఏర్పాటు చేశారు. ప్రస్తుత మంత్రిమండలి చివరి భేటీ ఇదే అవుతుంది. ఆ సమావేశంలోనే ప్రస్తుత మంత్రిమండలిలో కొనసాగేవారెవరు? వైదొలగాల్సిందెవరనే విషయాన్ని ముఖ్యమంత్రి స్పష్టంచేసే అవకాశం వుందని సమాచారం. అయితే యథావిధిగా మంత్రివర్గ సమావేశానికి సంబంధించి వివిధ ప్రతిపాదనలతో కూడిన ఎజెండా సిద్ధమవుతున్నది. మంత్రివర్గ భేటీకి సంబంధించిన ఎజెండాపై అధికారులకు మౌఖిక ఆదేశాలు అందినట్లు తెలిసింది. దీనిపై నేడోరేపో అధికారిక వర్తమానాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంపే అవకాశముంది. ఈ భేటీ అనంతరం సీఎం కచ్చితంగా గవర్నర్‌తో సమావేశం కావాల్సి వుంటుంది. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అంశాలన్నీ గవర్నర్‌తో జరిగే భేటీలో సీఎం వివరిస్తారు. ఈలోగా ఎవరెవరు రాజీనామాలు చేయాలన్న అంశంపై ముఖ్యమంత్రి స్పష్టత ఇస్తారు. ఇప్పుడున్న మంత్రులతో రాజీనామాలు చేయించడమా? లేక తొలగించడమా? అన్నది సీఎం విచక్షణాధికారంపై ఆధారపడి వుంటుంది. తొలగింపు కన్నా సీఎం ఆదేశిస్తే రాజీనామాలు చేయడానికే సిద్ధమని కొందరు మంత్రులు ఇదివరకే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. మంత్రివర్గంలో ఏ మంత్రులను మార్చుకోవాలో…ఆ జాబితాను సీఎం గవర్నర్‌కు లేఖ ద్వారా అందజేసే అవకాశం వుంది. అప్పుడు గవర్నర్ వాటిని ఆమోదిస్తూ నోటిఫై చేస్తారు. ఆ తర్వాత ఖాళీల భర్తీకి కొత్త పేర్లను గవర్నర్‌కు అందజేయాల్సి వుంటుంది. కొత్త జాబితాను ఆమోదించి, ప్రమాణస్వీకార మహోత్సవానికి సమయం ఇవ్వాలని గవర్నర్‌ను జగన్ కోరుతారు. 7వ తేదీన మంత్రివర్గం భేటీ అయిన తర్వాత 11వ తేదీన క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు సమయం సరిపోతుందని భావిస్తున్నారు. అందువల్ల ఏప్రిల్ 11నే మంత్రివర్గ విస్తరణకు ముహూర్తంగా భావించాల్సి వుంటుంది. (Story: క్యాబినెట్ విస్తరణ ముహూర్తం కుదిరింది!)
See Also: ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు!
వావ్! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!
రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్ : బడ్జెట్ రూ.800 కోట్లు
ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)