బాలికా సాధికారతతో ప్రగతిశీల సమాజం
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: ప్రగతిశీల సమాజానికి బాలికా సాధికారత అవసరం ఉందని బిల్డింగ్ బ్లాక్ గ్రూప్ (బీబీజీ) ఎంవీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. తన జన్మదినాన్ని పురస్కరించుకొని బేగంపేటలోని దేవనార్ బ్లైండ్ స్కూల్‌లో ‘ప్రేరణ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలు తమ సామర్థ్యాలను నిరూపించుకుంటున్నారని చెప్పారు. సరైన అవకాశాలు, వనరులు అందించినప్పుడు ఇంకా రాణిస్తారన్నారు. భారతదేశంలో అనేక ప్రాంతాలలో బాలికలకు విద్యపై హక్కు ఉన్నప్పటికి.. ఇప్పటికీ వారికి విద్య అందుబాటులో లేదన్నారు. ఈ ముఖ్యమైన సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా బీబీజీ బంగారు తల్లి గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో విద్య ద్వారా బాలికలకు సాధికారత కల్పించడానికి కృషి చేస్తున్నామన్నారు. బంగారు తల్లి లక్ష్యం ప్రతిష్టాత్మకమైనదన్నారు. 2040 నాటికి రెండు మిలియన్ల బాలికలకు విద్య ద్వారా సాధికారత కల్పించనున్నామని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని సుమారు 170,000 మంది బాలికల జీవితాలను తన కార్యక్రమాల ద్వారా సానుకూలంగా ప్రభావితం చేసిందన్నారు. (Story : బాలికా సాధికారతతో ప్రగతిశీల సమాజం)