UA-35385725-1 UA-35385725-1

గోదావరి జలాలతో తెలుగుతల్లికి జలహారతి

గోదావరి జలాలతో తెలుగుతల్లికి జలహారతి

నదుల అనుసంధానం ఏపీకి గేమ్ ఛేంజర్

మూడేళ్లలో బనకచర్లకు గోదావరి జలాలు

మూడు నెలల్లో డీపీఆర్, టెండర్లు – హైబ్రీడ్ విధానంలో పనులు

ముఖ్యమంత్రి చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్

న్యూస్‌తెలుగు/అమరావతి,డిసెంబర్ 30 : గోదావరి జలాలను బనకచర్లకు తరలించి తెలుగుతల్లికి జలహారతి ఇవ్వడం తన జీవితాశయమని, ఇది పూర్తైతే ఏపీకి గేమ్ ఛేంబర్ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చరిత్ర తిరగరాసే ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో కరవు అనే మాట వినబడదన్నారు. నదుల అనుసంధానంతో భావి తరాలకు నీటి సమస్య ఉండదని చెప్పారు. గోదావరి జలాలను బనకచర్లకు తరలించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ….స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్‌లో పది సూత్రాల్లో నీటి భద్రతకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవరకూ సీమకు నీళ్లివ్వాలనే ఆలోచన ఎవరూ చేయలేదు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ సమక్షంలో ఒక ఒప్పందం జరిగిందని, ఆ సందర్భంలో శ్రీశైలం నుంచి తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా తమిళనాడుకు కెనాల్ నీరివ్వడానికి తాను సిద్ధంగా ఉన్నామని అన్నారని గుర్తు చేశారు. తెలుగుగంగ ద్వారా రాయలసీమ, తమిళనాడుకు నీరిచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు.

90 శాతం ప్రాజెక్టులు నిర్మించిన ఘనత టీడీపీదే

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ, ఏపీలో ఉన్న 90 శాతం ప్రాజెక్టులు ప్రారంభించి పూర్తిచేసిన ఘనత టీడీపీది. గండికోట, కండలేరు, సోమశిల ఇలా అనేక ప్రాజెక్టులు నిర్మించాం. 2014 రాష్ట్ర విభజన సమయంలో నాటి కేంద్ర ప్రభుత్వం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. తెలంగాణలోని 7 మండలాలను ఏపీకి ఇస్తేనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని ప్రధాని మోదీకి చెప్పగా 7 మండలాలను ఏపీలో కలుపుతూ ఆర్డినెన్స్ తెచ్చారు. నీటి విషయంలో ఎన్టీఆర్ ముందుచూపుతో ఆలోచన చేశారు. వెలుగొండ ప్రాజెక్టుకు పునాదిరాయి వేశాను. ఉత్తరాంధ్రలో తోటపల్లి ప్రారంభించి పూర్తిచేశాను.

80 లక్షల మందికి తాగునీరు…7.5 లక్షల ఎకరాలకు నీరు

గోదావరి నుంచి సముద్రంలోకి వృధాగా పోయే 3 వేల టీఎంసీల నీటిలో 300 టీఎంసీల నీటిని ఒడిసిపట్టడమే ఈ ప్రాజెక్టు చేపట్టడం వెనుక ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్టు పూర్తైతే 80 లక్షల మందికి తాగునీరు, 7.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుంది. మూడు దశల్లో బనకచర్ల ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాము. పోలవరం నుంచి కృష్ణా నదికి నీరు మళ్లించడం మొదటి దశ కాగా, రెండోదశలో బొల్లాపల్లి జలాశయం నిర్మించి నీళ్లు తరలిస్తాము. మూడోదశలో బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచర్లకు నీటిని మళ్లిస్తాము. గోదావరి నీటిని కృష్ణా నదికి దాని నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్‌కు అక్కడి నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్‌కు తరలిస్తాము. ఈ ప్రాజెక్టు పూర్తైతే రాయలసీమ రతనాలసీమగా మారుతుంది. పెన్నా నది ద్వారా నెల్లూరుకు నీరు ఇవ్వొచ్చు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రకాశం జిల్లాలో కరవును అరికట్టవచ్చు.

రిజర్వాయర్‌ల నిర్మాణంతో నీటి సమస్యకు చెక్

ఉత్తరాంధ్రలో వర్షపాతం ఎక్కువగా ఉన్నా నీటి కొరత ఉంది. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కరవు వల్ల సాగు దెబ్బతింది. సకాలంలో నీళ్లు ఇవ్వగలిగితే రాయలసీమను రతనాలసీమగా మార్చవచ్చు. గతంలో అనంతపురంలో అతి తక్కువ తలసరి ఆదాయం ఉండేది. మా ప్రభుత్వంలో ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడంతో తలసరి ఆదాయం 4-5 శాతానికి చేరింది. పట్టిసీమ రాకతో సకాలంలో పంట చేతికి అందుతోంది. 1970లో 371 టీఎంసీల నీరు 1994లో 5,959 టీఎంసీ నీరు 2024లో 4,114 టీఎంసీల నీరు సముద్రంలోకి పోయింది. ఈ 50 ఏళ్లలో సగటున యేడాదికి 3 వేల టీఎంసీల నీరు గోదావరి నుంచి వృధాగా సముద్రంలోకి వెళ్తోంది. ఈసారి వరుణుడు కరుణించడం, ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతగా పనిచేయడంలో రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లలో కలిపి 983 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం రిజర్వాయర్ల నీటి సామర్థ్యం 729 టీఎంసీలుగా ఉంది. జనవరికి రిజర్వాయర్లలో 74 శాతం నీరు ఉండటం ఒక చరిత్ర. వర్షపు నీటిని సకాలంలో రిజర్వాయర్లకు పంపడంతో నీటిని నిల్వ చేయగలిగాము. నదుల అనుసంధానం చేసి ఎక్కడికక్కడ రిజర్వాయర్లు కడితే రాష్ట్రంలో నీటి సమస్య అనేదే ఉండదు.

విధ్వంసమైన వ్యవస్థలను పునరుద్ధరిస్తున్నాం

గత పాలకుల అసమర్థత, అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది. విధ్వంసమైన వ్యవస్థలను పునరుద్ధరిస్తున్నాము. భావితరాలకు ఉపయోగపడే గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై ప్రజల్లో చర్చ జరగాలి. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు హైబ్రీడ్ విధానంలో ప్రైవేటు పార్టనర్ షిప్‌ను చేర్చే అంశాన్ని ఆలోచిస్తున్నాము. ఇప్పటికే ప్రాజెక్టు గురించి కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌కు వివరించాను. డీపీఆర్ పూర్తి చేసి 2-3 నెలల్లో టెండర్లు పిలుస్తాము. సకాలంలో నిధులు అందితే మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది.(Story :గోదావరి జలాలతో తెలుగుతల్లికి జలహారతి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1