దేశ సంపద పెరిగితే సామాన్యులకు లాభమేది: సిపిఐ
న్యూస్‌తెలుగు/ వనపర్తి : దేశ సంపద పెరిగితే సామాన్యులకు ఒరిగిందేమిటని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాల నరసింహ ప్రశ్నించారు. శనివారం వనపర్తి సిపిఐ కార్యాలయంలో సిపిఐ జిల్లా విస్తృత కౌన్సిల్ సమావేశం టి శ్రీహరి అధ్యక్షతన నిర్వహించారు. బాల నరసింహ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశ సంపద, ఆదాయం పెరిగిందని, ప్రపంచంలో ఇండియా ఐదవ ఆర్థిక వ్యవస్థ నుంచి మూడుకు చేరనుందని, దేశంలోఐదు రోజులకు ఒకరు రూ. 8388 కోట్లు సంపాదించి బిలినీరు అవుతున్నారని గొప్పలు చెబుతున్నారన్నారు. దేశ సంపదను జనాభాతో లెక్కించి తలసరి ఆదాయం లెక్కిస్తారన్నారు. అంబానీ కి.. రిక్షా కార్మికునికి ఒకటే తలసరి ఆదాయం వస్తుందని, దానివల్ల సామాన్యులకు ఒరిగేది లేదన్నారు. దేశంలో 80 కోట్ల మంది ఇంకా రేషన్ బియ్యం పైనే ఆధారపడుతున్నారని పేదల బతుకులు మారలేదనటానికి ఇది సూచిక అన్నారు. దేశం ఆకలి సూచిలో 108వ స్థానంలో ఉందని దేశంలో పేదరికం పెరిగిందనడానికి ఇది నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ మహిళలపై అత్యాచారాలు దాడులు పెరిగాయన్నారు. గిరిజనులను అడవుల నుంచి తరిమికొట్టి గనులను బిలియనీర్లకు అప్పగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడం లేదన్నారు. రెండు లక్షల రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు కాలేదు అన్నారు. రైతు భరోసా ఎగ్గొడితే చూస్తూ ఊరుకోమన్నారు. ఖరీఫ్ ఇవ్వాల్సిన రైతు భరోసా ఇవ్వాల్సిందేనన్నారు. అసైన్డ్ భూములు, ఇనాం భూములపై యాజమాన్యపు హక్కులు కల్పించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలని కోరారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కె విజయ రాములు జిల్లాలో సభ్యత్వాన్ని పెంచాలని, కొత్త గ్రామాలకు పార్టీని విస్తరించాలన్నారు. నాయకులు శ్రీరామ్, రమేష్, గోపాలకృష్ణ, మోష, రాబర్ట్, అబ్రహం, బాలస్వామి, భాస్కర్, రవీందర్, కుతుబ్, భరత్, సీఎనై శెట్టి ఎర్రకుర్మయ్య తదితరులు పాల్గొన్నారు. (Story : దేశ సంపద పెరిగితే సామాన్యులకు లాభమేది: సిపిఐ)