ఈసారి యువత కొట్టే దెబ్బకు వైకాపా మళ్లీ లేవకూడదు
పార్టీ పరిశీలకులకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు దరఖాస్తులు అందజేసిన జీవీ
న్యూస్‌తెలుగు/ వినుకొండ : రాష్ట్రంలో త్వరలో జరగబోతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత కొట్టే దెబ్బకు మళ్లీ వైకాపా లేవకూడదని తెలుగుదేశం పార్టీ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నప్పుడే జగన్ లాంటి నియంత కొమ్ములు వంచిన యువతరం, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలతో ఆ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయాలని కోరారు. ఉద్యోగాల్లేకుండా, ఉపాధి లేకుండా అయిదేళ్ల పాటు సాగించిన విధ్వంసపు పాలనను దృష్టిలో పెట్టుకుని ప్రతిఒక్క రు ఓట్లు నమోదు చేసుకుని మార్పును బలపరిచేందుకు కూటమి అభ్యర్థిని గెలించాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదుకు సంబంధించిన దరఖాస్తులను గురువారం ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పంపిణీ చేశారు. వినుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు పరిశీలకులుగా పార్టీ నాయకులు పంచుమట్టి భూపతిరావు, పాములపాడు శ్రీనివాసరావు, నల్లబోతు శ్రీనివాసరావు, రఘురావు నాయుడు, సైదారావు, రాంకోటేశ్వరరావును నియమించారు. వినుకొండ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వారికి ఓటు నమోదు దరఖాస్తులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే జీవీ యువత, కూటమి సానుభూతి పరులను ఎవరూ మిగిలిపోకుండా ఓటర్లుగా నమోదు చేయించాలన్నారు. తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు స్పందించి పట్టభద్రులంతా నమోదయ్యేలా చూడాలన్నారు. కూటమి ప్రభుత్వం రావడంతోనే డీఎస్సీకి ఏర్పాట్లు, ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు చేస్తున్న కసరత్తు, నైపుణ్య గణన, నైపుణ్యాభివృద్ధి చేస్తున్న కృషిని యువత అందరికీ వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు యార్లగడ్డ లెనిన్ కుమార్ , పట్టణ తెదేపా అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్, శావల్యాపురం, వినుకొండ రూరల్ మండలాల పార్టీ అధ్యక్షులు గుంటూరు సాంబశివరావు, మాదినేని ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు. (Story : ఈసారి యువత కొట్టే దెబ్బకు వైకాపా మళ్లీ లేవకూడదు)