చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పొట్టి శ్రీరాములు వర్ధంతి
న్యూస్ తెలుగు /చింతూరు : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర విభాగం, రాజనీతి శాస్త్రం, తెలుగు విభాగాల ఆధ్వర్యంలో సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకొని ‘ఆత్మార్పణ దినం’ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె రత్నమాణిక్యం విచ్చేసి విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మద్రాసు రాష్ట్రంలో తెలుగు వారికి జరుగుచున్న అన్యాయాన్ని సహించలేక, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 1952 అక్టోబర్ 19న నిరాహార దీక్ష ప్రారంభించి 1952 డిసెంబర్ 15న మరణించడంతో 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు. రాజనీతి శాస్త్ర విభాగాధిపతి ఎస్ అప్పన్నమ్మ మాట్లాడుతూ జెవిపి కమిటీ 1948లో భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని వ్యతిరేకించిందని, పొట్టి శ్రీరాములు మరణానంతరం ఫజల్ ఆలీ కమిటీ భాషా ప్రయోక్త రాష్ట్రాలకు ఆమోదం తెలిపిందన్నారు. తెలుగు విభాగాధిపతి కె లక్ష్మీ ప్రసన్నకుమారి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగం కేవలం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మాత్రమే గాక, అది తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి, భాషా చైతన్యానికి ప్రత్యేకతగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎమ్ శేఖర్, డాక్టర్ వై పద్మ, డాక్టర్ కె శకుంతల, జి సాయికుమార్, ఆర్ మౌనిక, బి శ్రీనివాసరావు, ఎన్ ఆనంద్, ఎమ్ నాగమోహన్రావు, కె కీర్తి, ఆర్ కిరణ్మయి, తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.(Story:చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పొట్టి శ్రీరాములు వర్ధంతి)

