ఆటో కార్మికుడి నుంచి సర్పంచ్ బరిలో
ఆదర్శనీయం ‘ఆటో కొమురన్న’
న్యూస్ తెలుగు ప్రతినిధి సిద్దిపేట జిల్లా/ అక్కన్నపేట: పంచాయితీ ఎన్నికల్లో సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో జరగబోయే ఎన్నికల్లో ఎవరు విజేతగా నిలుస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.గతంలో వార్డు సభ్యుడిగా ఎన్నికైన గంగారపు కొమురయ్య ( ఆటో కొమురన్న) తాజా ఎన్నికల్లో సర్పంచ్ స్థానాన్ని ఎస్సీ రిజర్వేషన్ కు కేటాయించడంతో కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.సామాన్య మధ్య తరగతి కుటుంబంలో జీవనం గడిపే తాను ఆటో నడుపుతూ నిత్యం అక్కన్నపేట గ్రామం నుండి హుస్నాబాద్ పట్టణానికి విద్యార్థులను,ప్రజలను వారి అవసరాల కోసం గమ్య స్థానాలకు చేరవేసి ప్రజల మన్నల్ని పొంది ఉత్తమ ఆటో కార్మికుడిగా పేరొందారు.తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ‘ఆటో కొమురన్న’ కు స్థానిక ప్రజల్లో ఉన్నత విశ్వసనీయత కల్గిన వారీగా గుర్తింపు పొందారనే చెప్పాలి. సర్పంచ్ గా ఎన్నుకుంటే గ్రామాన్ని అన్ని వర్గాల భాగస్వామ్యంతో అభివృద్ధి దిశగా అడుగులు వేసేలా కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఆదరించి కత్తెర గురుక్తు ఓటేసి గెలిపిస్తే అక్కన్నపేట గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. గ్రామంలో మద్దతుదారులతో కలిసి ర్యాలీ చేపట్టి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణాలు, చేతిపంపులు, వీధి దీపాల ఏర్పాటు, వసతులు కల్పిస్తానని హామీ ఇచ్చారు. యువత భవిష్యత్ కోసం కార్యచరణ రూపొందించి అమలు పరుస్తానన్నారు( ప్రత్యేక కథనం/సీనియర్ జర్నలిస్ట్: నారదాసు ఈశ్వర్ )(Story : ఆటో కార్మికుడి నుంచి సర్పంచ్ బరిలో )

