6న జరిగే తిరుణాళ్లకు కట్టుదిట్టమైన బందోబస్తు
డీఎస్పీ నాగేశ్వరరావు
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ పట్టణంలో జూలై 6న జరుగనున్న తొలిఏకాదశి పర్వదినం సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు నరసరావుపేట డిఎస్పీ కె.నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా తొలిఏకాదశి ఏర్పాట్లు పరిశీలించడానికి పట్టణానికి వచ్చిన డిఎస్పీ కె.నాగేశ్వరరావు, పట్టణ సీఐ శోభన్ బాబు, రూరల్ సీఐ ప్రభాకర్ తో కలసి పట్టణంలో పలు ప్రాంతాలతో పాటు కొండపై పలు ఏర్పాట్లు పరిశీలించి తగు సూచనలు తెలిపారు. కొండపైకి భక్తులు వెళ్లుటకు తిరుపతి నుండి కండిషన్ బస్ సర్వీసులను రప్పిస్తున్నట్లు తెలిపారు. తొలిఏకాదశి రామలింగేశ్వర స్వామి తిరునాళ్ళ సందర్భంగా పట్టణంలో ఎలక్ట్రిక్ ప్రభలు ఇతరత్రా సాంఘీక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు తప్పని సరిగా పట్టణ పోలీస్ స్టేషన్ లో సిఐ ద్వారా వ్రాతపూర్వక అనుమతులు తప్పక తీసుకోవాలని తెలిపారు. నిబంధనలకు వ్యతిరేఖంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరుగకుండా పోలీస్ పరమైన రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. పట్టణంలో ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగిస్తూ రోడ్లపై వాహనాలు ఆపితే పట్టణ పోలీస్ స్టేషన్ కు వెహికల ద్వారా తరలిస్తామని వాహనాలు దెబ్బతినే అవకాశాలు ఉంటాయని ఎవరి వాహనాలు వారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంగించకుండా రోడ్లపై అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయరాదని అన్నారు. నియోజకవర్గంలో రౌడీషీటర్ల కదలికల పై నిరంతరం నిఘా కొనసాగుతుందని పోలీస్ వారు పిలిచినప్పుడు హాజరు కావాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. పట్టణంలో పోలీస్ సేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయని ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా పోలీస్ సహాయసహకారాలు ప్రజలు పొందాలని అన్నారు. పండుగ ప్రశాంత వాతావరణం లో జరిగే విధంగా భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది. నియోజకవర్గ ప్రజలకు తొలిఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో పట్టణ, రూరల్ సిఐలు,ఎస్ఐలు పాల్గొన్నారు.(Story:6న జరిగే తిరుణాళ్లకు కట్టుదిట్టమైన బందోబస్తు)