న్యూస్ తెలుగు / వినుకొండ : రాష్ట్ర ప్రజలు 151 నుంచి 11 సీట్లకు పడేసినా బుద్ధి తెచ్చుకోకుండా రపారపా భాషతో చెలరేగి పోతున్న వైకాపాను శాశ్వతంగా లేవకుండా చేయాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు. జగన్ పోతు పోతూ 10.5 లక్షల కోట్లు అప్పులు వారసత్వంగా ఇచ్చినా సంక్షేమం, అభివృద్ధిని పరగులు తీయిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇచ్చే అసలు మద్దతు అదే అన్నారాయన. 65 లక్షలమందికి ఒకేసారి రూ.1000 పింఛన్ పెంచిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి, జగన్‌కు ఎక్కడైనా పోలిక ఉందా అని ప్రశ్నించారు. వినుకొండలోని గంగినేని కల్యాణ మండపంలో మంగళవారం నాయకులతో నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. సుపరిపాలనలో తొలిఅడుగు- ఇంటింటికీ తెలుగుదేశం ప్రచారానికి సంబంధించిన గోడపత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జులై 2 నుంచి నెల పాటు ఇంటింటికీ తిరిగి ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. పింఛన్ల మొత్తం పెంపు, అన్న క్యాంటీన్ల పునః ప్రారంభం, మత్స్యకార భరోసా, తల్లికి వందనం పథకాలు ప్రభుత్వం అమలు చేసిందని, ఈనెలలో అన్నదాతా సుఖీభవ, ఆగస్టులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు రంగం సిద్ధం చేసిందని వివరించాలన్నారు. నియోజకవర్గంలో చేస్తున్న, చేయబోయే అభివృద్ధి పనుల్ని వివరించాలని తెలిపారు. జగన్ హయాంలో ఒక్కరికే అమ్మఒడి అందితే కూటమి ప్రభుత్వం ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ తల్లికి వందనం ఇస్తున్నామని అన్నారు. చంద్రబాబు చెప్పిన దానికంటే మెరుగ్గా పనిచేయాలని, మంచి ఫలితాలు అందుకోవా లని, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రిలోకేష్ పనిచేస్తున్నారని.. ఉచితగ్యాస్ సిలిండర్‌పై ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని తెలిపారు. ఈ నెలాఖరు లోపు అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాల్లో జమకానున్నాయని… ఈ వివరాలన్నీ ప్రజలకు తెలియజేయా లన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదంలో భాగంగా 2చోట్ల ఎన్డీయే ప్రభుత్వం ఉండబట్టే రాజధాని అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కుకు నిధులు వచ్చాయన్న చీఫ్‌విప్ జీవీ ఆ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. తొలి ఏడాదిలోనే ఇన్ని పథకాలు ఇచ్చింది కూటమి మాత్రమే అన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రతిఏడాది కొత్త పథకంతో ప్రజలకు మేలు చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పంగా పెట్టుకున్నారన్నారు. ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమిస్తూ కొత్త పథకాలు ప్రవేశ పెట్టాలనేది ఆయన ఆలోచనగా తెలిపారు. ఇదే సమయంలో మంత్రి లోకేష్ యువతకు ప్రాధాన్యం ఇస్తూ పార్టీకి కొత్త ఉత్తేజం తీసుకుని వస్తున్నారని అన్నా రు . క్షేత్రస్థాయిలో బూత్ కన్వీనర్లు, కో బూత్ కన్వీనర్లలో బాగా పనిచేసిన వారికి అభినందలు తెలిపారు. డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, మానుకొండ శివప్రసాద్, కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. (Story:వైకాపాను శాశ్వతంగా లేవకుండా చేయాలి)