వినుకొండను ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యం
శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5 బస్ షెల్టర్ల నిర్మాణానికి శ్రీకారం
బస్ షెల్టర్లు, వాకింగ్ ట్రాక్‌ల నిర్మాణ పనులకు చీఫ్ విప్ జీవీ శంకుస్థాపన
న్యూస్ తెలుగు /వినుకొండ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు రాష్ట్రంలోనే వినుకొండను ఆధునిక పట్టణంగా, గ్రేటర్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. రోడ్లు, డ్రెయిన్లు, మంచినీటి సౌకర్యాలు, మైదానాలు, బస్‌షెల్టర్లు, కొండపై రామలింగేశ్వరస్వామి ఆలయం అభివృద్ధి, ఘాట్‌రోడ్ నిర్మాణం, వ్యాయామ సదుపాయాలు అన్నింటిలో కనిపిస్తున్న పుోగతే అందుకు నిదర్శనమన్నారు. వినుకొండ జూనియర్ కళాశాల, ఎన్నెస్పీ మైదానంలో వాకింగ్ ట్రాక్‌ల నిర్మాణ పనులకు ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు బుధవారం శంకుస్థాపన చేశారు. శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలో 5 చోట్ల ఆధునిక బస్ షెల్టర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కారంపూడి రోడ్‌లో బస్ షెల్టర్ నిర్మాణానికి జీవీ ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడిన ఆయన యోగా, వ్యాయామం ఆరోగ్యానికి, ఆహ్లాదకరానికి చాలా అవసరమన్నారు. అందుకోసమే వాకింగ్ ట్రాక్ నిర్మాణంతో పాటు ఓపెన్ జిమ్ ఆధునీకరిస్తున్నామని తెలిపారు. గత తెదేపా పాలనలోనే ఈ వాకింగ్ ట్రాక్‌ను వేశామని, ఐదేళ్ల వైసీపీ పాలనలో కనీసం తట్టమట్టి పోయలేదని, వారి నిర్లక్ష్యంతో ట్రాక్ మొత్తం దెబ్బతిందని మండిపడ్డారు. ఇప్పుడు కొత్తట్రాక్‌కు నిధులతో పాటు జిమ్ పరికరాలకు మరమ్మతులు చేపట్టి ఆధునికంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఎన్నెస్పీ మైదానంలో మరో వాకింగ్ ట్రాక్ కూడా సిద్ధం చేస్తున్నామన్నారు. వర్షాకాలం నేపథ్యంలో నాలాలు, మురుగుకాల్వలలపై దృష్టి పెట్టామని, వర్షపు నీరు నిల్వ ఉండకుండా పెద్ద డ్రైన్లను ప్రతి రహదారిలో నిర్మిస్తున్నామన్నారు. గ్రామాలు, పల్లెల నుంచి వచ్చిన ప్రజలు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నారని, సాధారణ ప్రజలతో పాటు విద్యార్థులకు ఉపయోగపడేలా శివశక్తి ఫౌండేషన్ ద్వారా పట్టణంలో 5 బస్ షెల్టర్లు నిర్మిస్తున్నామని తెలిపారు. అందుకోసం మున్సిపల్ కమిటీ తీర్మానం చేసినందుకు అభినందన లు తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ సహకారంతో తాగునీటి పథకం కోసం రూ. 210 కోట్ల నిధులు తీసుకొచ్చామని, త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో తాగునీటి పథకం పనులను 2% కూడా చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. పట్టణంలో ఒక్క మరుగుదొడ్డి కూడా కట్టలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పట్టణంలో మోడరన్ మరుగుదొడ్లతో పాటు బస్ షెల్టర్ల నిర్మాణం చేపట్టామని అన్నారు. రామలింగేశ్వరస్వామి ఘాట్ రోడ్ నిర్మాణానికి కూడా నిధులు తెచ్చామన్నారు. మురుగునీటి శుద్ధికి రూ.18 కోట్లతో 2మురుగునీటి శుద్ధి కేంద్రాలు తీసుకొచ్చామన్నారు. వినుకొండ పట్టణాన్ని పరిశుభ్రత, పచ్చదనంతో తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ పర్సన్ ఇన్‌ఛార్జి మక్కెన మల్లికార్జునరావు, మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, కూటమి నాయకులు పాల్గొన్నారు. (Story:వినుకొండను ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యం)