మొక్కల పెంపకాన్ని ఉద్యమంలా చేపట్టాలి
వనమహోత్సవంలో భాగంగా వినుకొండలో మొక్కలు నాటిన చీఫ్ విప్ జీవీ
న్యూస్ తెలుగు /వినుకొండ : ప్రతిఒక్కరూ తప్పనిసరిగా విధిగా మొక్కలు నాటాలని, నాటిన వాటిని బ్రతికించుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే విషయాన్ని గుర్తించాలని, కాలుష్యం బారి నుంచి తప్పించుకోవడానికి మొక్కల పెంపకమే ఏకైక మార్గమని సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమాన్ని వినుకొండలో ఆయన ప్రారంభించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. మొక్కలను సంరక్షిస్తామంటూ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వానికి పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ వంటివి ఏమీ పట్టలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పరిస్థితిని మారుస్తున్నామని, సీఎం చంద్రబాబు మొదటి నుంచి కూడా హరితాంధ్రప్రదేశ్ కోసం ప్రయత్నిస్తున్నారని గుర్తుచేశారు, అందులో భాగంగానే ఇప్పుడు వన మహోత్సవం చేపట్టామన్నారు. పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి పిలుపునిచ్చారని, ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. వైకాపా పాలనలో ఎక్కడికక్కడ పచ్చని చెట్లను నరికేశారని, అటవీశాఖ సామాజిక వన నర్సరీలనూ పట్టించుకోలేదని పేర్కొన్నారు. నిర్వహణకు నిధులు ఇవ్వకుండా ప్రభుత్వ నర్సరీలను కళావిహీనంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించుకోవాలంటే ఆక్సిజన్, నీడనిచ్చే ప్రకృతి బిడ్డలను పెంచాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా రోజూ 3.50 కోట్ల చెట్లను నరుకుతుంటే కేవలం 50 లక్షల మొక్కలనే నాటుతున్నారని జీవీ ఆంజనేయులు తెలిపారు. మొక్కలను విచ్చలవిడిగా నరికివేయడం వల్ల ఏర్పడుతున్న దుష్పరిణామాలను మనం చూస్తున్నామన్నామని, ఎక్కడైతే మొక్కలు పుష్కలంగా ఉంటాయో అక్కడ ఎండ తీవ్రత తక్కువగా ఉంటుందని, సకాలంలో వర్షాలు కురుస్తాయని, నీళ్లకు కరవు ఉండదు, పాడి పంటలు బాగా పండుతాయని వెల్లడించారు. పర్యావరణ సమతుల్యత కాపాడేలా మొక్కలు నాటి సంరక్షించడాన్ని ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. నాటిన ప్రతి మొక్కను బతికించుకునేందుకు పౌర సమాజం తమ వంతు బాధ్యతగా కృషిచేయాలని తెలిపారు. పల్నాడు, వినుకొండ ప్రాంతంలో ఇంటింటికీ మొక్కలు నాటాలని, ఖాళీ ప్రదేశాల్లోనూ మొక్కలు నాటాలని సూచించారు. హరితాంధ్రప్రదేశ్ సాధన కోసం ప్రతి పౌరుడు ముందుకు నడవాలని, ఆ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడుకోవాలన్న, కాలుష్య నియంత్రణ చేపట్టాలన్నా ప్లాస్టిక్ నియంత్రణే లక్ష్యంగా ముందుకెళ్లాలని సూచించారు. పాలిథిన్ కవర్లకు ప్రత్యామ్నాయంగా వస్త్ర, జనపనార సంచులు వినియోగించాలని సూచించారు. ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని ప్రతి పౌరుడు నియంత్రించాలని, వాటిని తయారు చేయడం కూడా పెద్ద నేరమని చెప్పారు. పర్యావరణానికి నష్టం చేకూర్చే పాలిథిన్ సంచులు, ప్లాస్టిక్ డబ్బాలను వాడొద్దని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సుభాష్ చంద్రబోస్, జనసేన నాయకులు నాగ శీను రాయల్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. (Story:మొక్కల పెంపకాన్ని ఉద్యమంలా చేపట్టాలి)

