సిసి రోడ్లతో పాటు డ్రైనేజీలు నిర్మించాలి: ఏఐవైఎఫ్
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లాలోని గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద సిసి రోడ్లను నిర్మిస్తున్నారని, డ్రైనేజీలు కట్టడం లేదని, సీసీ రోడ్లతో పాటు డ్రైనేజీలను నిర్మించాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్, జిల్లా ఉపాధ్యక్షుడు సంతోష్ డిమాండ్ చేశారు. ఆదివారం పానగల్ మండలం కేతే పల్లి లో డ్రైనేజీలు లేక రోడ్ల పై ప్రవహిస్తున్న మురుగు నీటిని పరిశీలించి మాట్లాడారు. సిసి రోడ్డు మాత్రమే నిర్మించి వాటికి రెండు వైపులా డ్రైనేజీలు కట్టకపోవడంతో మురుగు నీరు ఇండ్లలోకి వస్తుందని ప్రజలు చెబుతున్నారన్నారు. వర్షాకాలంలో డ్రైనేజీలు లేకపోతే నీళ్లు ఇండ్లలోకి వస్తాయని ఆందోళన చెందుతున్నారన్నారు. మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తే వృద్ధులు, పిల్లలు జారిపడే ప్రమాదం ఉందని చెబుతున్నారన్నారు. ఉపాధి హామీ కింద కొత్త సిసి రోడ్లతో పాటు వాటికి డ్రైనేజీలు నిర్మించాలని, గతంలో డ్రైనేజీలు లేని రోడ్లకు డ్రైనేజీలను ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించాలని కోరారు. సిపిఐ నేతలు పెద్ద హనుమంతు, రామదాసు, రామాంజనేయులు, కురుమయ్య స్థానిక ప్రజలు పాల్గొన్నారు.(Story : సిసి రోడ్లతో పాటు డ్రైనేజీలు నిర్మించాలి: ఏఐవైఎఫ్)