బాల్య వివాహాలు జరుగకుండా కట్టుదిట్టమైన
చర్యలు తీసుకోవాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : జిల్లాలో బాల్య వివాహాలు జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ప్రధానమంత్రి 2015 జనవరి, 22న బేటి బచావో బేటి పడావో కార్యక్రమాన్ని ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా జనవరి, 22 నుంచి మార్చి 8 వరకు మహిళా సాధికారత, అమ్మాయిల సంరక్షణ సాధికారత పై సంక్షేమ శాఖ ద్వారా జిల్లాలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుచున్నది. అందులో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బాల్య వివాహాలు పూర్తిగా అరికట్టడం, అమ్మాయిలకు రక్తహీనత నుండి విముక్తి కల్పించడం, మంచి విద్యాభ్యాసాలు అందించడం జరగాలన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుచున్నట్లు తెలిస్తే ఎవరైనా సరే వెంటనే 1098 టోల్ ఫ్రీ నెంబరుకి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. బాల్య వివాహాలు చేసే తల్లిదండ్రుల తో పాటు పెళ్లికి సహకరించే వారిపై, పెళ్లి చేసే అర్చకుడు లేదా ఖాజీ, పాస్టర్ ల పై కేసులు నమోదు చేయడం జరుగుతుందనీ అవసరం అయితే బైండోవర్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు.
వనపర్తి జిల్లాలో ప్రతి వెయ్యి మంది పురుషులలో కేవలం 888 మంది మహిళలు మాత్రమే ఉన్నారని ఈ ఆంతర్యాన్ని క్రమంగా తగ్గించే ప్రయత్నం చేయాలని లైన్ డిపార్ట్మెంట్ అధికారులను ఆదేశించారు.
అమ్మాయిల్లో రక్తహీనతను పారద్రోలడానికి వైద్య శాఖ, సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, చిన్న పిల్లల్లో సరైన ఎదుగుదల లేని పిల్లలను ఎన్.ఆర్.సి సెంటరుకు పంపించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు, అదనపు కలక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య,
ఆర్డీఓ సుబ్రమణ్యం, డిఎస్పీ కే. ఉమామహేశ్వర రావు, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, డి.సి.పి. ఒ యం. రాంబాబు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాలు జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. (Story : బాల్య వివాహాలు జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి)