ఈ ప్రభుత్వానికి భయపడవద్దు
నేను మరో 30 ఏళ్లు రాజకీయం చేస్తా
కళ్లు మూసి తెరచేలోగా జమిలీ ఎన్నికలు
నేను మీకు భరోసాగా ఉంటా..
వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో జగన్ భేటీ
న్యూస్ తెలుగు/అమరావతి: ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికీ నేను భరోసా ఇస్తున్నానని, నేను మరో 30 ఏళ్లు రాజకీయాలు చేస్తానని, ప్రతిపక్షంలో మన సమర్ధతను నిరూపించుకోవడానికి ఇదొక అవకాశమని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ప్రజాప్రతినిధులకు సూచించారు. పార్టీ కోసం, ప్రజల కోసం గట్టిగా పని చేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నొక్కిచెప్పారు. కళ్లు మూసుకుని, తెరిచేలోగా ఏడాది గడిచిపోతుందని, జమిలి ఎన్నికలు అంటున్నారని, అదే జరిగితే ఎన్నికలు మరింత మందుగా వస్తాయన్నారు. ప్రజల తరపున గొంతు విప్పే విషయంలో ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదని, రాజకీయాల్లో మనం విలువలు, విశ్వసనీయత పాటిస్తున్నామని, ఎన్నో క్లిష్ట పరిస్థితులు అధిగమించామని జగన్ చెప్పారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేశారు. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ఉందని, టీడీపీ ఇస్తామన్న పథకాలన్నీ మోసాలుగా మిగిలిపోయాయని ధ్వజమెత్తారు. అనంతరం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ సోమవారం సమావేశమయ్యారు. మనం యుద్ధ రంగంలో ఉన్నామని, విజయం దిశగా అడుగులు వేయాలని, ప్రజా సమస్యల విషయంలో రాజీలేని పోరాటం చేయాలన్నారు. నిజాయితీగా, చిత్తశుద్ధితో ప్రజల తరపున పోరాటం చేయాలని, ప్రజలకు తోడుగా ఉంటూ, వారితో మమేకమైతే గెలుపు సాధించినట్లేనని చెప్పారు. అందుకనే ప్రజా సమస్యలపై పోరాటంలో వెనుకడుగు వేయవద్దఅని, మనం వేసే ప్రతి అడుగు పార్టీ ప్రతిష్టను పెంచేదిలా ఉండాలని, ఎక్కడా రాజీ పడకూడదని సూచించారు. అసెంబ్లీలో మనం తప్ప వేరే ప్రతిపక్షం లేదని, ప్రతిపక్ష హోదా విషయంలో అధికార పార్టీ వైఖరిని ప్రజలకు తేటతెల్లం చేసేందుకే అసెంబ్లీకి వెళ్లామని స్పష్టంచేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు రద్దు చేస్తే కోర్టుకు వెళ్తామని జగన్ స్పష్టం చేశారు. విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనాన్ని మన ప్రభుత్వ హయాంలోనే నిర్మించామని, పేరు తీసేయాలన్న ఉద్దేశంతో ఏకంగా అంబేడ్కర్ విగ్రహం మీదే దాడికి దిగారన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా ప్రజలకు రూ.2.73 లక్షల కోట్లు ఇచ్చి మంచి చేశామని, మనమిచ్చిన పథకాలన్నీ రద్దు చేశారని వివరించారు. ఈ ప్రభుత్వాన్ని చూసి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ సమావేశానికి శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
జగన్‌తో రోజా భేటీ
తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి మాజీ మంత్రి ఆర్కే రోజా విచ్ఛేశారు. ఈ సందర్భంగా నగరిలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై జగన్‌తో చర్చించారు. టీడీపీ నేత గాలి జగదీష్ చేరుతున్నారన్న వార్తలు రావడంతో రోజా భేటీకి ప్రాధాన్యత ఏర్పడిరది. గాలి జగదీష్ చేరికను రోజా వ్యతిరేకించినట్లు ప్రచారముంది. ఇదే అంశంపై జగన్‌తో ఆమె చర్చించినట్లు తెలిసింది. (Story: మరో 30 ఏళ్లు రాజకీయం చేస్తా)