గతి తప్పిన కాంగ్రెస్..ఏపీలో చావుకు సిద్ధం!
కాంగ్రెస్‌కు సీనియర్లు బై..బై..!
షర్మిల తీరుపై అసంతృప్తులు
పదేపదే జగన్‌నే టార్గెట్ చేయడంపై ఆగ్రహం
వైఎస్‌ఆర్‌సీపీలోకి ఉండవల్లి, రఘువీరారెడ్డి, హర్షకుమార్!
కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తాళాలు పడినట్లేనా?
న్యూస్ తెలుగు/అమరావతి: ఏపీలో కాంగ్రెస్‌లో ఉన్న కొద్ది మంది సీనియర్లు సైతం పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇటీవల పీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ వైఎస్‌ఆర్‌సీపీలో చేరికతో ఈ ప్రచారానికి బలం చేకూరింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం కాంగ్రెస్‌కు ఏపీలో కోలుకోలేని దెబ్బ తగిలింది. దానికితోడుగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ ఏర్పాటు చేయడం వెరసి ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన 2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా ఏపీలో కాంగ్రెస్ ఘోర ఓటమిని చవిచూసింది. 2014 నుంచి 2024 వరకు ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు వచ్చిన పరిస్థితులు కన్పించలేదు. తన సొంత అన్న వైఎస్ జగన్‌తో వచ్చిన విభేదాల కారణంగా షర్మిల వైఎస్‌ఆర్‌సీపీకి దూరమై, తెలంగాణ రాష్ట్రానికి వెళ్లిపోయారు. వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి అక్కడ బలపడేందుకు ఆమె ప్రయత్నించినప్పటికీ స్పందన రాలేదు. తెలంగాణ ఎన్నికల నాటికి ఆ పార్టీ తరపున అభ్యర్థులు ఉన్నప్పటికీ, తమ పార్టీ పోటీకి దూరంగా ఉంటున్నట్లుగా షర్మిల ఏకపక్షంగా ప్రకటించారు. ఈ చర్యలతో వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అభ్యర్థులు ఆమెపై తిరుగుబాటు చేశారు. అనంతరం 2024 ఎన్నికల నాటికి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల నాయకత్వం వహించారు. ఆమెతోపాటు ఆ పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులంతా ఓటమి పాలయ్యారు. ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) అభ్యర్థుల కంటే, వైఎస్‌ఆర్‌సీపీపై ఆమె అధికంగా విమర్శలు గుప్పించారు. ఆమెతోపాటు తన తల్లి వైఎస్ విజయమ్మను వైఎస్‌ఆర్‌సీపీకి ప్రచారం చేయనీయకుండా కట్టడి చేయగలిగారు. ఏదైతేనేమీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ ఓటమికి ఆమె ఒక కారణంగా నిలిచారు. ఆ తర్వాత జగన్ అధికారం కోల్పోయినప్పటికీ, అధికారంలో ఉన్న కూటమి పార్టీపై కంటే…వైఎస్‌ఆర్‌సీపీపైనే ఆమె ఎక్కువుగా విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. పోనీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని, వైఎస్‌ఆర్‌సీపీ పార్టీని సమానంగా విమర్శించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా అంటే అదీ లేదు. అధికంగా జగన్‌పైనే షర్మిల ఎటాక్ చేయడం పరిపాటిగా మారింది. ఎన్నికల అనంతరం దాదాపు తొమ్మిది నెలల వరకు ఆమె ధోరణి మారలేదు. దీంతోపాటు ఉన్న సీనియర్లను గౌరవించకుండా ఏకపక్ష నిర్ణయాల్ని ఆమె తీసుకుంటున్నారన్న విమర్శలున్నాయి.
షర్మిలపై కాంగ్రెస్ సీనియర్ల ఆగ్రహం!
షర్మిల వ్యవహారశైలిపై కాంగ్రెస్ సీనియర్ నేతలు..గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో తత్సంబంధాలు ఉన్న వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వ పాలన వైఫల్యాల్ని, తొమ్మిది నెలల్లో ఇచ్చిన హామీల అమలుపై ఆమె మొక్కుబడిగానే ప్రశ్నిస్తూ, పూర్తి స్థాయిలో జగన్‌పైనే ఎటాక్ చేయడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. దీనిపై అనేకసార్లు షర్మిలకు కాంగ్రెస్ సీనియర్ నేతలు చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఆమె బేఖాతరు చేసినట్లు సమాచారం. సీనియర్లకు సైతం ఆమె ఫోన్ నంబరు ఇవ్వకుండా కేవలం వ్యక్తిగత సిబ్బందితోనే అరకొరగా మాట్లాడి వదిలేయడమూ అసంతృప్తిని రాజేసింది. ఎన్నికల్లో షర్మిల డబ్బులు తీసుకుందంటూ కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ ఏకంగా షర్మిలపై ఆరోపణలు చేశారు. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి విజయవాడ ఆంధ్రరత్నభవన్ ఎదుట సుంకర పద్మశ్రీ నిరసన చేపట్టారు. ఏఐసీసీ ఇన్‌చార్జిలకు, ముఖ్యనేతలకు షర్మిల వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. ఈ చర్యలతో షర్మిల వ్యవహారంపై ఆధిష్టానం మందలించినట్లు సమాచారం. ఒకానొక దశలో ఆమెను రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాల నుంచి తప్పించాలని ఫిర్యాదులు వెళ్లగా, ఆ దిశగా ఏఐసీసీ నాయకత్వం ఆలోచించినట్లు ప్రచారముంది. షర్మిల వల్ల కాంగ్రెస్‌కు లాభం కంటే నష్టమే ఎక్కువని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. దీంతోపాటు చంద్రబాబు ప్రభుత్వానికి, చంద్రబాబుకు ఆమె పరోక్షంగా మద్దతిచ్చేలా వ్యవహరిస్తున్నట్లుగా, ఈ వైఖరితో కాంగ్రెస్ పార్టీ మనుగడ మరింత ప్రశ్నార్థకంగా మారిందని ఆ పార్టీ సీనియర్లు వాపోతున్నారని తెలిసింది.
దీంతో ఒక్కొక్కరూ పార్టీని వీడి, తన అభిమాన నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనయుడు అయిన జగన్ పార్టీలోకి చేరేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లుగా సొంత పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.
వైఎస్‌ఆర్‌సీపీలోకి ఉండవల్లి, హర్షకుమార్, రఘువీరారెడ్డి!
నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో తత్సంబంధాలు కలిగిన కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి, ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న ఉండవల్లి అరుణ్‌కుమార్ వైఎస్‌ఆర్‌సీపీలోకి వచ్చేందుకు సిద్ధమైనట్లు సామాజిక మాద్యమాల వేదికగా ప్రచారం జరుగుతోంది. వారితోపాటు రాజమండ్రి మాజీ ఎంపీ హర్షకుమార్ వైఎస్‌ఆర్‌సీపీ కండువా కప్పుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, గన్నవరం కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ, కొన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులు, నగర అధ్యక్షులు, పీసీసీ కార్యదర్శులు ఏకకాలంలో పార్టీకి గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటుతోనైనా ఖాతా తెరుస్తుందా అంటే అనుమానమే. తన సోదరిపై జగన్ పరోక్షంగా ఈ రకంగా రాజకీయ ఎత్తుగడ వేసినట్లుగా, దీంతో కాంగ్రెస్‌లోని సీనియర్లను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లుగా ప్రచారముంది. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఇటీవల తాడేపల్లి జగన్ నివాసంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ సీనియర్లు కూడా వస్తారనే సంకేతాలిచ్చారు. కాంగ్రెస్‌లో ఉండి దాదాపు 11 ఏళ్లకుపైగా రాజకీయంగా నష్టపోయిన నేతలంతా తమ భవిష్యత్‌పైనా మల్లగుల్లాలు పడుతున్నారు. దీంతో కొందరు ఇప్పటికే వైఎస్‌ఆర్‌సీపీ కీలక నేతలతో చర్చలు నడుపుతున్నట్లు సమాచారం. ఉన్న సీనియర్లు కాస్తా కాంగ్రెస్‌ను వీడితే..ఇక షర్మిలకు గడ్డు పరిస్థితులే ఎదురవుతాయి. ఇదే కొనసాగితే ఏపీలో కాంగ్రెస్ మనుగడ కష్టసాధ్యమే. కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తాళాలు పడటం ఖాయం. (Story: కాంగ్రెస్‌కు సీనియర్లు బై..బై..!)
Follow the Stories:
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైరస్!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి
దుర్గగుడి లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు!
జైల్లో నా భర్తను.. టార్చర్ చేస్తున్నారు..!
రిజిస్ట్రేషన్ శాఖలో డిజిటల్ విప్లవం: లాభమా? నష్టమా?
ఇంటర్ విద్యార్థులకు పండుగలాంటి వార్త!