రెండో వన్డే టీమిండియాదే
రోహిత్ సెంచరీ: భారత్ జయభేరి
కటక్: టీమిండియా తన విజయపరంపరను కొనసాగిస్తోంది. తాజాగా ఇంగ్లాండ్‌పై రెండో వన్డేలోనూ తిరుగులేని విజయం నమోదు చేసింది. కటక్‌లో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై అద్భుతమైన విజయం సాధించింది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ సంచలనాత్మక సెంచరీ నమోదు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును విజయపథాన నడిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 304 పరుగులు చేయగా, భారత్ ఇంకా 5.3 ఓవర్లు మిగిలిఉండగానే 6 వికెట్లు మాత్రమే కోల్పోయి 308 పరుగులు చేసి జయభేరి మోగించింది. రవీంద్ర జడేజా 35 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకొని టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారతజట్టు ఆరంభం నుంచీ భారీ షాట్లతో చెలరేగింది. ముఖ్యంగా రోహిత్ విజృంభించి ఆడాడు. చాన్నాళ్ల తర్వాత ఫామ్‌లోకి వచ్చి తన సత్తా చూపాడు. రోహిత్, శుభ్‌మన్ గిల్‌లు తొలి వికెట్టుకు 136 పరుగుల భాగస్వామ్యం అందించారు. గిల్ 52 బంతుల్లో 9 బౌండరీలు, ఒక సిక్సర్‌తో 60 పరుగులు చేసి ఓవర్టన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాక మిగతా బ్యాట్స్‌మన్ల సహకారంతో రోహిత్ జట్టును ముందుకు నడిపించాడు. రోహిత్ కేవలం 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సాయంతో 119 పరుగులు చేసి లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో రషీద్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. రోహిత్‌కు ఇది 32వ వన్డే సెంచరీ. సెంచరీల్లో మూడోస్థానంలో ఉన్న రాహుల్ ద్రావిడ్‌ను వెనక్కి నెట్టి రోహిత్ మూడో స్థానానికి చేరుకున్నాడు. సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలతో మొదటి స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ 81 సెంచరీలతో రెండో స్థానంలో నిలిచాడు. కాగా, రోహిత్ వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్లలో రెండోస్థానానికి చేరుకున్నాడు. అతను 332 సిక్సర్లతో గేల్ (331) రికార్డును బద్దలు గొట్టాడు. షాహిద్ అఫ్రీది 351 సిక్సర్లతో ప్రథమ స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఓవర్టన్ 2 వికెట్లు తీసుకోగా, అట్కిసన్, రషీద్, లివింగ్‌స్టోన్‌లు ఒక్కొక్క వికెట్టు చొప్పున తీసుకున్నారు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ చూడటానికి భారీ స్కోరునే నమోదు చేసింది. బెన్ డకెట్ (65), జో రూట్ (69), లివింగ్ స్టోన్ (41), జోస్ బట్లర్ (34), హ్యారీ బ్రూక్ (31), ఫిల్ సాల్ట్ (26)లు మాదిరి స్కోర్లు సాధించారు. భారత బౌలర్లలో జడేజా మూడు వికెట్లు తీసుకోగా, షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలు ఒక్కొక్క వికెట్టు చొప్పున తీసుకున్నారు. ఈ రెండు జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ 12వ తేదీన అహ్మదాబాద్‌లో జరుగుతుంది. (Story: రోహిత్ సెంచరీ: భారత్ జయభేరి)
Follow the Stories:
ఇంటర్ విద్యార్థులకు పండుగలాంటి వార్త!