ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కమిటీ
న్యూస్‌తెలుగు/ వనపర్తి : రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ళు లేని నిరుపేదలకు ఇళ్ళు నిర్మించుకునేందుకు రూ 5.00 లక్షల ఆర్థిక సహాయం అందించే ఇందిరమ్మ పథకంలో ఏ ఒక్క అర్హత లేని వారికి కాకుండా అర్హత ఉన్న లబ్ధిదారులను మాత్రమే ఎంపిక చేసేందుకు ఈ గ్రామ కమిటీలు, మున్సిపల్ వార్డు కమిటీకి కీలక పాత్ర పోషిస్తాయని జిల్లా కలక్టర్ ఆదర్శ్ సురభి నేడోక ప్రకటనలో తెలిపారు. గ్రామ కమిటీలో చైర్మన్ గా గ్రామ సర్పంచ్ లేదా స్పెషల్ ఆఫీసర్ వ్యవహరిస్తారని, ఇద్దరు మహిళా సంఘాల సభ్యులు, ముగ్గురు గ్రామ ప్రజలు అందులో ఒకరు బి.సి. మరో వ్యక్తి ఎస్సి లేదా ఎస్టి నుండి సభ్యులుగా ఉంటారు. పంచాయతీ సెక్రటరీ కన్వీనర్ గా ఉంటారు. మున్సిపల్ వార్డుల్లో అయితే కౌన్సిలర్ లేదా స్పెషల్ ఆడిసర్ చైర్మన్ గా ఉండి ఇద్దరు మహిళా సంఘాల సభ్యులు, ముగ్గురు వార్డు ప్రజలు అందులో ఒకరు బి.సి. ఇంకొకరు ఎస్సి లేదా ఎస్టి కేటగిరి నుండి సభ్యులు గా ఉంటారు. వార్డు ఆఫీసర్ కన్వీనర్ గా ఉండే ఈ కమిటీలను అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల నుండి ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ల నుండి జాబితా తెప్పించుకొని జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదంతో జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డులకు కమిటీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. గ్రామ కమిటీలు అర్హులైన లబ్ధిదారులతో జాబితాను తీర్మానం చేసి ఎంపీడీఓ లు, మున్సిపల్ కమిషనర్లకు పంపించాల్సి ఉంటుంది. ఈ కమిటీలు జనవరి 21 నుండి 24 వరకు అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారుల తుది జాబితా రూపొందిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. (Story : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కమిటీ)