పోలీసులు, ప్రజలకు మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పరచడంలో క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి
న్యూస్‌తెలుగు/వనపర్తి : పోలీసులు, ప్రజలకు మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పరచడంలో క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ గిరిధర్ రావుల తెలిపారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయం మైదానంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పోలీసుశాఖ ఆధ్వర్యంలో ” జన మైత్రి” పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. ఇందుకు జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై ఎస్పి రావుల గిరిధర్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్ తో కలిసి క్రీడా పోటీలను ప్రారంభించారు. శాంతికి సూచకంగా పావురాలను బెలూన్లను గాలిలోకి వదిలారు. అనంతరం టాస్ వేసి క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించి, కాసేపు క్రికెట్ బాటింగ్, వాలీబాల్ ఆడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీసులకు ప్రజలకు మధ్యలో స్నేహపూర్వక వాతావరణం ఏర్పరిచేందుకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. క్రీడలు కేవలం శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయని చెప్పారు. సెలవులు వచ్చినప్పుడు యువత ఇతర పోకడలకు పోకుండా క్రీడలను ఆడాలన్నారు. డయాబెటిస్, రక్తపోటు వంటి వ్యాధులను చేరకుండా ఉంచేందుకు క్రీడలు ఉపయోగపడతాయని చెప్పారు. కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాలుపంచుకోవాలని, ఎస్పీ కార్యాలయ మైదానంలో నిర్వహిస్తున్న టోర్నమెంట్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
ఎస్పీ మాట్లాడుతూ పోలీసులంటే ప్రజలు భయం వీడాలని, సాధారణ ప్రజల పట్ల పోలీసులు స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారని చెప్పారు. ప్రజలు ఎలాంటి భయం లేకుండా పోలీసులను సంప్రదించవచ్చని, ప్రజల్లో భయం పోగొట్టేందుకే ఇటువంటి క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అంతేకాకుండా నేరాల కట్టడిలో ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏ ఆర్ అదనపు ఎస్పీ వీరా రెడ్డి, డిఎస్పీ లు వెంకటేశ్వరా రావ్, ఉమా మహేశ్వర రావ్, జిల్లా యువజన క్రీడల అధికారి సుధీర్ రెడ్డి, పోలీసులు, క్రీడాకారులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. (Story : పోలీసులు, ప్రజలకు మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పరచడంలో క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి)