శ్రమజీవుల దోపిడీకి వ్యతిరేకంగా
సిపిఐ వందేళ్ళ పోరాటం
విజయ రాములు
న్యూస్‌తెలుగు/వనపర్తి : దేశంలో శ్రమజీవుల దోపిడీకి వ్యతిరేకంగా వందేళ్లుగా సిపిఐ పోరాడుతూ వస్తోందని, ఎర్రజెండా నీడన చేరి పోరాడాలని సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు పిలుపునిచ్చారు.100వ ఆవిర్భావ దినం సందర్భంగా నల్లగొండలో జరుగుతున్న భారీ బహిరంగ సభకు వెళుతున్న వాహనాలను సోమవారం వనపర్తి అంబేద్కర్ చౌక్ లో జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. కార్మిక రాజ్యం, సమసమాజ స్థాపన, దోపిడీ లేనిసమాజం నిర్మాణం కోసం సిపిఐ 1925 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్లో పురుడు పోసుకున్న సిపిఐ 2024డిసెంబర్ 26 నాటికి శత జయంతి జరుపుకుందన్నారు. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లాలో100వ ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తున్నారు అన్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారని, జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆంగ్లేయులపై పోరాడిందని,సంపూర్ణ స్వాతంత్రం కావాలని పిలుపునిచ్చిన తొలి పార్టీ సిపిఐ అన్నారు. స్వాతంత్ర పోరాటంలో సిపిఐ అత్యంత కీలక పాత్ర పోషించిందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిందన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తెలంగాణలో 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిందన్నారు. పోరాటంలో 4500 మంది అమరులయ్యారన్నారు. స్వాతంత్రానంతరం దేశంలో కార్మికుల శ్రమదోపిడి, భూస్వాములు, దొరల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పేదలకు భూములు, ఇళ్ల స్థలాల పంపిణీ, రైతుకు గిట్టుబాటు ధర, కార్మికులకు కనీస వేతనం, మహిళలకు హక్కుల కోసం పనిచేస్తుందన్నారు. ఎర్రజెండా పోరాటాల వల్లనే పేదలకు అభివృద్ధి సంక్షేమ పథకాలను పాలకులు చేస్తున్నారన్నారు. సమస్యల పరిష్కారానికి ఏకైక మార్గం పోరాటమేనని, సిపిఐ పోరాట జెండా కింద ఏకమై హక్కుల కోసం ప్రజలు పోరాడాలి అన్నారు. గ్రామ గ్రామాన పార్టీని ఏర్పాటు చేసుకోవాలన్నారు. నల్గొండలో జరిగే భారీ బహిరంగ సభ సిపిఐ భవిష్యత్తు పోరాటాలకు దిశా నిర్దేశం చేస్తుందన్నారు. వనపర్తి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు భారీగా బయలుదేరి వెళ్లారు. జిల్లా నేతలు కళావతమ్మ, రమేష్ గోపాలకృష్ణ, శ్రీహరి, రాబర్ట్ ,మోష,సీఎన్ శెట్టి,శివ, జె చంద్రయ్య కృష్ణవేణి, గీత, భాస్కర్, మహేష్, బాలరాజు, చిన్న కురుమన్న తదితరులు పాల్గొన్నారు. (Story : శ్రమజీవుల దోపిడీకి వ్యతిరేకంగా సిపిఐ వందేళ్ళ పోరాటం)