ప్రభుత్వం ఢీ అడిక్షన్ సెంటర్లను బలోపేతం చేయాలి
తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షులు య౦ఏ, ఖాదర్ పాష
న్యూస్‌తెలుగు / వనపర్తి : తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలో డ్రగ్ కల్చర్ విస్తృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఢీ అడిక్షన్ సెంటర్లను బలోపేతం చేయాలని తెలంగాణ జన సమితి పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షులు ఖాదర్ పాష ఒక ప్రకటన మంగళవారం జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చాప కింద నీరు లాగా విస్తరిస్తున్న డ్రగ్స్ కల్చర్ తో యువత ప్రమాదంలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మత్తు పదార్థాల వాడకం పెరిగిపోయిన దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. డ్రగ్స్ కల్చర్ తో యువశక్తి నిర్వీర్యమవుతుందని, వారి జీవితాలను డ్రగ్స్ కల్చర్ బుగ్గిపాలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వాటి నుంచి బయటపడేందుకు దోహదపడే డీ అడిక్షన్ కేంద్రాలు కేవలం ఆల్కహాల్ ను మాన్పించే కేంద్రాలుగానే పనిచేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన డ్రగ్స్, గంజాయి మాఫియాను అరికట్టడానికి పాలకులు, ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. వీటితోపాటు నార్కోటిక్స్, డ్రగ్ కంట్రోల్, పోలీస్ నిఘా విభాగం సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్లు తీవ్రం చేసి డ్రగ్స్ వ్యాప్తిని నిరోధించి, డ్రగ్స్ మాఫియా నుండి యువతను, విద్యార్థులను కాపాడాలని కోరారు. పాఠశాల, కళాశాలలో, ఎక్కువగా పేదవారు నివసించే బస్తీలలో, వాటి చుట్టుపక్కల ఉండే విద్యా సంస్థల సమీపంలో నిఘా పెంచి, విద్యాసంస్థలలో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని కోరారు. (Story : ప్రభుత్వం ఢీ అడిక్షన్ సెంటర్లను బలోపేతం చేయాలి)