రాముడు విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి 5 లక్షలా?
నిందితునికి రిలీఫ్ ఫండ్ నుంచి నిధులెలా ఇస్తారని నిలదీసిన శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స
విజయనగరం/న్యూస్‌తెలుగు: విజయనగరం జిల్లా రామతీర్థం రాముడు విగ్రహం ధ్వంసం కేసులో ఏ 2నిందితుడికి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి 5 లక్షలు ఎలా ఇస్తారని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఆరు నెలల పాలనలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, అందులో ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా అప్పట్లో సంచలనం సృష్టించిన రామతీర్థం శ్రీరాముడు విగ్రహం కేసులో ఎ 2 నిందితునకు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి 5 లక్షల రూపాయలు ఇవ్వడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అన్నారు. అందులో సాక్షాత్తూ దేవస్థానం చైర్మన్ అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా చెక్ అందించడం జరిగిందన్నారు. ముద్దాయి అమాయకుడు, నిరపరాధి అనుకుంటే కేసును వెనక్కి తీసుకోవాలన్నారు. లేకుంటే అక్రమ కేసులు పెట్టిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ కేసులను ప్రోత్సహించిన అప్పటి ప్రభుత్వ నేతల పైనా అయినా చర్యలు చేపట్టాలన్నారు. అవేమీ లేకుండా ప్రజా ధనాన్ని ఒక ముద్దాయికి ఇవ్వడం వెనుక ఉద్దేశ్యం ఏమిటో చెప్పాలన్నారు. ఇలాంటి వాటిని ప్రభుత్వం ప్రోత్సహించడం వెనుక సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారని ప్రశ్నించారు.
రాజకీయంగా ఆదుకోవలనుకుంటే.. పార్టీ ఫండ్ నుండి ఇవ్వాలని హితవు పలికారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల్లేక రైతులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదన్నారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనలో విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. సంక్రాంతి పండగ పేరుతో కోడి పందాలతో ప్రజలను తప్పుదోవ పట్టించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు. (Story: రాముడు విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి 5 లక్షలా?)