పెండింగ్ కేసుల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి
పోలీస్, న్యాయశాఖ అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలి
ఫాస్ట్ ట్రాక్, ప్రత్యేక కోర్టులపై న్యాయ, హోం మంత్రుల సమీక్ష
న్యూస్తెలుగు/అమరావతి : రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న వివిధ రకాల కోర్టు కేసుల పరిష్కారంపై న్యాయశాఖ, పోలీస్ శాఖ అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని రాష్ట్ర న్యాయ, మైనారిటి సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సూచించారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ప్రత్యేక కోర్టుల పనితీరు పై ముఖ్య అధికారులతో మంత్రులు సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మంత్రులు ఫరూక్, అనిత మాట్లాడారు. కేసుల తీవ్రతను బట్టి, ఏ ఉద్దేశ్యంతో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ప్రత్యేక కోర్టులు పనిచేస్తున్నాయో అందుకు అనుగుణంగా ఆయా కోర్టుల్లోని కేసులు ఎక్కువ కాలం కొనసాగకుండా వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేటట్లుగా సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.అవసరమైతే రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లి వారి ఆదేశానుసారం సమన్వయం తో ముందుకు సాగాలని సూచించారు. ముఖ్యంగా సంచలన కేసుల్లో బాధిత కుటుంబాలకు సత్వర న్యాయ పరిష్కారానికి టాస్క్ ఫోర్స్ కోర్టు, ప్రత్యేక కోర్టులు మరింత వేగంగా పనిచేయాలని సూచించడం జరిగింది. సమీక్ష సమావేశంలో న్యాయశాఖ కార్యదర్శి జి ప్రతిభా దేవి, హోం శాఖ కార్యదర్శి తదితర ముఖ్యమైన అధికార బృందం పాల్గొన్నారు.
23న విజయవాడలో క్రిస్మస్ తేనేటి విందు
విజయవాడలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల 23వ తేదీన ప్రభుత్వం తేనేటి విందు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. లబ్బీపేట ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్ లో సోమవారం సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తేనేటి విందు కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తేనేటి విందు కార్యక్రమానికి క్రైస్తవ కుటుంబ సభ్యులందరూ హాజరై విజయవంతం చేయాలని మంత్రి ఫరూక్ పిలుపునిచ్చారు (Story : పెండింగ్ కేసుల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి)