కామన్వెల్త్ కరాటే ఛాంపియన్‌షిప్ విజేతకు జీవీ అభినందనలు
న్యూస్‌తెలుగు/వినుకొండ : కామన్వెల్త్ కరాటే ఛాంపియన్‌షిప్-2024లో స్వర్ణం, కాంస్య పతకాలు సాధించి సత్తాచాటిన తెలుగు కుర్రాడు రామినేని రోహన్ ని అభినందించారు చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. ఇలాంటి మరెన్నో విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి, పల్నాడు ప్రాంతానికి, వినుకొండకు మరింత మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు . ఇటీవల జరిగిన కామన్వెల్త్ కరాటే ఛాంపియన్ షిప్-2024లో భారత్ కు ప్రాతినిధ్యం వహించిన రోహన్ స్వర్ణ, కాంస్య పతకాలు సాధించాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం వినుకొండలో మాజీ ఎమ్మెల్యే మక్కెన, పెదకంచర్ల గ్రామస్థులు, కుటుంబసభ్యులతో చీఫ్ విప్ జీవీని కలిసిన రోహన్ తాను సాధించిన పతకాలు ఆయనకు చూపించారు. రోహన్‌ను శాలువతో సత్కరించి ఇలాంటి మరెన్నో విజయాలు సాధించాలని వెన్నుతట్టి ప్రోత్సహించారు. గత నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు దక్షిణాఫ్రికాలోని డర్బన్ వేదికగా జరిగిన 11వ కామన్వెల్త్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో ఈ ఘనత సాధించాడు రోహన్. 63 కిలోల విభాగంలో అతడు స్వర్ణం గెలిచి విశ్వవేదికపై త్రివర్ణ పతాకను రెపరెపలాడించాడు. ఎలైట్ విభాగంలో స్వర్ణంతో పాటు క్లబ్స్ విభాగంలో కాంస్యం అందుకున్నాడు. అంతకు ముందు జాతీయ, జోనల్ స్థాయిలో పలు పతకాలు గెలుచుకుని కరాటేలో ప్రతిభ చూపాడు రోహన్. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్‌విప్ జీవీ ప్రతిభావంతులపై క్రీడాకారులకు రాష్ట్రంలో ఉజ్వల భవిష్యత్ ఉండబోతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇటీవల తీసుకుని వచ్చిన నూతన క్రీడా విధానంతో ఇలాంటి వర్థమాన, గ్రామీణ క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం అందిస్తామన్నారు. ఒకవైపు క్రీడా మౌలిక వసతుల పెంపు, మరోవైపు వివి ధ పోటీల్లో గెలిచిన విజేతలకు ప్రోత్సాహం ద్వారా క్రీడారంగానికి ఊతం ఇవ్వాలన్నదే సీఎం చంద్రబాబు ఆలోచనగా తెలిపారు. (Story : కామన్వెల్త్ కరాటే ఛాంపియన్‌షిప్ విజేతకు జీవీ అభినందనలు)