ఓఆర్‌ఆర్ పై నుంచి పడిన టిప్పర్
గౌడవెల్లి పరిధిలో ఘటన
డ్రైవర్ సజీవ దహనం
న్యూస్‌తెలుగు/ మేడ్చల్ : చెత్త లోడుతో బాహ్య వలయ రహదారి మీదుగా వెళ్తున్న టిప్పర్ ప్రమాదవశాత్తు కిందపడి మంటలు చెలరేగడంతో డ్రైవర్ సజీవ దహనమైన ఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం భద్రాచలం జిల్లా ఇల్లెందుకు చెందిన పినబోయిన సందీప్(25) కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాంపల్లిలో నివాసం ఉంటూ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత అతడు మియాపూర్ నుంచి చెత్తను జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలించేందుకు చెత్తను లోడ్ చేసిన టిప్పర్‌ను బాహ్య వలయ రహదారి మీదుగా తీసుకు వస్తున్నాడు. మార్గమధ్యలో మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామ పరిధిలోకి రాగానే అండర్ పాస్ వద్ద ప్రమాదవశాత్తు టిప్పర్ బాహ్య వలయ రహదారి పైనుంచి కింద పడింది. ఆ వెంటనే టిప్పర్ వాహనానికి మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. 100 వాహనానికి సమాచారం రావడంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి అగ్ని మాపక యంత్రం సాయంతో టిప్పర్‌కు అంటుకున్న మంటలను ఆర్పివేశారు. ఈ మంటల్లో చికుక్కున్న డ్రైవర్ సందీప్ సజీవ దహనం అయ్యాడు. డ్రైవర్ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (Story : ఓఆర్‌ఆర్ పై నుంచి పడిన టిప్పర్)