Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలపై విద్యుత్‌ ఛార్జీల భారాన్ని అంగీకరించం

ప్రజలపై విద్యుత్‌ ఛార్జీల భారాన్ని అంగీకరించం

0

ప్రజలపై విద్యుత్‌ ఛార్జీల భారాన్ని అంగీకరించం

ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
ఈనెల నుంచి ప్రజలపై రూ.6,072 కోట్ల ట్రూఅప్‌ ఛార్జీల భారం
విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల చంద్రబాబు హమీ ఇచ్చారు
ఇప్పుడు ప్రతి యూనిట్‌కు సగటున రూ.1.25 పెంచుతున్నారు
ఫిబ్రవరి తర్వాత మరో రూ.9,412 కోట్ల భారం మోపబోతున్నారు
మొత్తంగా రూ.15,485 కోట్ల విద్యుత్‌ భారం వేస్తున్నారు
ఆ ట్రూఅప్‌ ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే సబ్సిడీగా భరించాలి
విద్యుత్‌ ఛార్జీల పెంపును మా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోంది
దీనిపై పార్టీ విధానాన్ని త్వరలో ప్రకటిస్తాం. ప్రజాగళం వినిపిస్తాం
కూటమి ప్రభుత్వంలో దారుణంగా అప్పుల పర్వం
6 నెలల్లో రూ.67,237 కోట్ల అప్పులు చేశారు
ఈ మంగళవారం మరో రూ.4 వేల కోట్ల అప్పులు
అంటే దాదాపు రూ.70 వేల కోట్ల అప్పులు చేశారు
మరి విద్యుత్‌ ట్రూఅప్‌ భారం కూడా భరించలేరా?
రూ.15,485 కోట్లు డిస్కంలకు చెల్లించలేరా?
ఇన్ని వేల కోట్ల అప్పులు. అయినా సూపర్‌ సిక్స్‌ అమలు లేదు!
పెన్షన్లు, అరకొర సిలిండర్లు తప్ప ఏ హామీ నెరవేర్చారు?
అదే మా ప్రభుత్వ హయాంలో 6 నెలల్లోనే ఎంతో మార్పు
ఏకంగా రూ.18,098 కోట్ల నగదు లబ్ధిదార్లకు బదిలీ 
కాకినాడ పోర్టులో బియ్యం రవాణాపై పవన్‌ డ్రామా
కాకినాడ ఎమ్మెల్యేను ప్రశ్నించిన డిప్యూటీ సీఎం పవన్‌
తన మంత్రే ఆ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలియదా?
పౌర సరఫరాల అధికారులు ఎవరి ఆధీనంలో పని చేస్తున్నారు
బియ్యం రవాణాపై సంబంధిత మంత్రి తనిఖీలకు వెళ్లొచ్చు
మరి డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ అక్కడికి ఎందుకు వెళ్లారు?
తన మంత్రిపై అనుమానంతో కూడా వెళ్ళి ఉండవచ్చు!
డిప్యూటీ సీఎం చిత్తశుద్ది ఏమిటో త్వరలోనే బయటకు వస్తుంది
పోర్టులో బియ్యం ఎగుమతులపై వ్యాపారులతో బీజేపీ నేతల సమావేశాలు
ఢిల్లీకి తీసుకువెళ్లి మరీ అనుమతులు ఇప్పించింది వాస్తవం కాదా?
షర్మిలను ఒక పార్టీ నాయకురాలిగా మేం గుర్తించడం లేదు
ఆమె అంశాలపై మాట్లాడాలే కానీ, వ్యక్తిగతంగా మాట్లాడొద్దు
ప్రెస్‌మీట్‌లో మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ హితవు
న్యూస్‌తెలుగు/ విశాఖపట్నం:
ట్రూఅప్‌ ఛార్జీల పేరుతో ప్రజలపై రూ.15,485 కోట్ల భారం మోపేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఈ నెల నుంచి ప్రజలపై రూ.6,072 కోట్ల ట్రూఅప్‌ ఛార్జీల భారం మోపుతున్నారని, ప్రతి యూనిట్‌ కు సగటున రూ.1.25 పెంచుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ వైయస్సార్‌సీపీ త్వరలోనే తన విధానాన్ని ప్రకటించబోతోందని, తమ పార్టీ ప్రజాగళాన్ని వినిపిస్తుందని వెల్లడించారు.
ఎన్నికల హామీ తుంగలో తొక్కారు:
– విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఏకంగా రూ.6,072 కోట్ల భారాన్ని ట్రూఅప్‌ ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపేందుకు ప్రయత్నిస్తున్నారు.
– అలాగే ఫిబ్రవరి తర్వాత మరో రూ.9,412 కోట్ల భారం మోపబోతున్నారు. అంటే మొత్తంగా రూ.15,485 కోట్ల మేర విద్యుత్‌ భారాన్ని ప్రజలపై వేస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు. ట్రూఅప్‌ ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే సబ్సిడీగా భరించాలి.
ఆరు నెలల్లో రూ.70 వేల కోట్ల అప్పులు!:
– కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతోంది. ఇప్పటి వరకు రూ. 67,237 కోట్లు అప్పులు చేసింది. ఈ మంగళవారం మరో రూ.4 వేల కోట్లు అప్పు తీసుకోబోతున్నారు. అంటే దాదాపు రూ.70 వేల కోట్ల అప్పులు చేశారు.
– దీనిలో నుంచి విద్యుత్‌ ట్రూఅప్‌ భారం రూ.15,485 కోట్లు డిస్కంలకు చెల్లించలేరా?
– ఇన్ని వేల కోట్ల అప్పులు చేసినా.. ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ హామీలు ఎందుకు అమలు చేయడం లేదు?
–  పెన్షన్‌ వెయ్యి రూపాయల పెంపు, అరకొర సిలిండర్లు తప్ప ఇప్పటి వరకు ఏ హామీని మీరు నెరవేర్చారు? కనీసం బడ్జెట్‌ లో మీ హామీలను నెరవేర్చడానికి కేటాయింపులు కూడా చేయలేదు.
– బడ్జెట్‌ అంకెలకు, మీరు చెప్పే దానికి ఎక్కడా పొంతన లేదు. కూటమి ప్రభుత్వం హనీమూన్‌ గడువు ముగిసింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సూపర్‌ సిక్స్‌ అమలుపై క్యాలెండర్‌ ను రిలీజ్‌ చేయాలి.
ఆనాడు, ఆ ఆరు నెలల్లో..:
– అదే మా ప్రభుత్వం హయాంలో, తొలి ఆరు నెలల్లోనే పలు హామీలు అమలు చేశాం. పూర్తి పారదర్శకంగా పథకాలు అమలు చేశాం. తొలి 6 నెలల్లోనే డీబీటీ ద్వారా ఏకంగా రూ.18,098 కోట్లు లబ్ధిదార్ల ఖాతాల్లో జమ చేశాం.
– ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేశాం.
– ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇటీవలి బడ్జెట్‌లో ఒక్క దీపం పథకాన్ని ఒక సిలెండర్‌ చొప్పున ఉచితంగా ఇచ్చేందుకు రూ.800 కోట్లు కేటాయించారు. దానిలో ఓ నాలుగు వందల కోట్లు వరకు ఖర్చు చేసి ఉంటారు. అంతకు మంచి ఏ హామీని పూర్తిస్థాయిలో నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం లేదు.
కూటమి ప్రభుత్వానికి విధానం లేదు:
– కూటమి ప్రభుత్వానికి ఒక విధానం, నిర్దిష్ట ప్రణాళిక లేదు. పాలన అస్తవ్యస్తంగా మారింది. బూడిద ఆదాయం కోసం కూటమి ఎమ్మెల్యేలు పోట్లాడుకుంటున్నారు. దానిపై సీఎం చంద్రబాబు ఏకంగా పంచాయితీ చేస్తున్నారు.
– నూతన మద్యం విధానం పేరుతో బెల్ట్‌షాప్‌లకు బహిరంగ వేలం వేస్తున్నారు. విజయనగరం జిల్లాలోని ఒక ఊరిలో బెల్ట్‌షాప్‌ నిర్వహణను వేలంలో రూ.50 లక్షలకు దక్కించుకున్నారంటే ఈ ప్రభుత్వం ఎంత గొప్పగా పని చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. దీనిపై టీడీపీ అనుకూల మీడియాలోనే కథనాలు వచ్చాయి.
కాకినాడ పోర్టులో పవన్‌ హంగామా. గబ్బర్‌సింగ్‌ సినిమా పార్ట్‌–3:
– కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం హోదాలో పవన్‌ కళ్యాణ్‌ చేసిన హంగామా గబ్బర్‌సింగ్‌ పార్ట్‌–3ని తలపిస్తోంది. బియ్యం అక్రమ రవాణాపై స్థానిక టీడీపీ ఎమ్మెల్యేను నిలదీసిన పవన్‌కళ్యాణ్‌కు అసలు ఆ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్నది తన పార్టీ సభ్యుడే అనే విషయం తెలియదా?  అలాగే పౌర సరఫరాల అధికారులు ఎవరి ఆధీనంలో పని చేస్తున్నారు?.
– బియ్యం రవాణాపై సంబంధిత మంత్రి తనిఖీలకు వెళ్ళారంటే అర్థం ఉంది. పవన్‌కళ్యాణ్‌ కూడా వెళ్లారంటే తన మంత్రిపై అనుమానంతో కూడా వెళ్ళి ఉండొచ్చని అనుకోవాల్సి వస్తోంది. బియ్యం అక్రమ రవాణాపై డిప్యూటీ సీఎం చిత్తశుద్ది ఏమిటో త్వరలోనే బయటకు వస్తుంది.
– దీనిపై మాట్లాడుతున్న బిజెపి నేతలు గతంలో ఏం చేశారో మరిచిపోయారు. పోర్టు నుంచి బియ్యం ఎగుమతులపై వ్యాపారులతో ఆ పార్టీ నేతలు ఇళ్ళలో సమావేశాలు నిర్వహించారు. ఢిల్లీకి తీసుకువెళ్లి మరీ అనుమతులు ఇప్పించిన విషయం వాస్తవం కాదా?
– కాకినాడ పోర్టులో పనులు ఏ సామాజికవర్గం వారు చేస్తున్నారంటూ డైవర్షన్‌ రాతలు పత్రికల్లో రాయిస్తున్నారు. తప్పు జరుగుతోందా? లేదా? తప్పు జరిగితే దానికి ఎవరు బాధ్యులు?. వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామన్న విషయాన్ని పక్కకు పెడుతున్నారు.
షర్మిలను పార్టీ నాయకురాలిగా గుర్తించడం లేదు:
– రాజకీయ పార్టీలు ప్రజలకు సంబంధించిన అంశాలపైనే మాట్లాడతాయి. వ్యక్తిగత వివాదాలను రాజకీయం చేయాలని అనుకోవు. – అందుకే వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకున్నట్లుగా మాట్లాడుతున్న షర్మిలను అసలు మేం ఒక రాజకీయ పార్టీ నాయకురాలిగానే గుర్తించడం లేదని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, గుడివాడ అమర్‌నాథ్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version