మహిళలు అన్ని రంగాలలో రాణించాలి
– సినీ నటి నయన సారిక
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: మహిళలు అన్ని రంగాలలో రాణించాలని సినీ నటి నయన సారిక తెలిపారు. బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ (బీబీజీ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నోవాటెల్ హెచ్ఐసీసీలో ఇటీవల బీబీజీ బంగారుతల్లి ఫౌండేషన్ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి నుంచే విద్యలో రాణించాలన్నారు. కృషి, పట్టుదల, అంకితభావంతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించగలరన్నారు. బంగారు తల్లి ద్వారా బాలికా సాధికారతకు పాటుపడటం అభినందనీయం అన్నారు.
ఈ సందర్భంగా బిల్డింగ్ బ్లాక్ గ్రూప్ సీఎండీ మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ 2040 నాటికి రెండు మిలియన్ల మంది బాలికలకు విద్యను అందించాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు. బంగారుతల్లి ఫౌండేషన్ బాలికా విద్యపై విశేషంగా కృషి చేస్తుందన్నారు. మహిళల అభ్యున్నతి దేశ ఉన్నతికి ఎంతో అవసరమన్నారు. పేద బాలికలకు కూడా నాణ్యమైన విద్యను అందేలా చేయడం మా లక్ష్యమన్నారు. విద్య ద్వారా వారి కలలను సాకారం చేయనున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయురాలు జ్యోతి మాట్లాడుతూ బిల్డింగ్ బ్లాక్ గ్రూప్, బంగారు తల్లి బృందాలకు అభినందనలు తెలిపారు. బంగారు తల్లి ప్రోగ్రామ్ బాలికలు విద్యనభ్యసించడానికి ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ఆడ పిల్లల చదువుపై తల్లిదండ్రులుకు అవగాహన కల్పిస్తున్నారన్నారు. బీబీజీ కృషితో ఆడ పిల్లలు ఆత్మవిశ్వాసంతో ఎదుగుతూ.. సమాజంలో మార్పు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
ఈ సందర్భంగా బంగారు తల్లి ప్రతినిధి నీరజ మాట్లాడుతూ బాలికలను శక్తివంతం చేయడానికి కమ్యూనిటీ మద్దతు అవసరమన్నారు. దీనికి సమిష్టి కృషి, సహాయక వాతావరణాన్ని సృష్టించడంలో మనలో ప్రతి ఒక్కరి పాత్ర ఉందన్నారు. ఆడపిల్లలను ప్రోత్సహించడం, శక్తివంతం చేయడం ద్వారా అర్ధవంతమైన మార్పును తీసుకురాగల రేపటి నాయకులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. బిల్డింగ్ బ్లాక్ గ్రూప్ అసోసియేట్స్ రూ.పది లక్షల చెక్కును అందజేశారు. ఈ మొత్తాన్ని బిల్డింగ్ బ్లాక్ గ్రూప్ సీఎండీ మల్లికార్జున రెడ్డి రెండితలు చేసి బీబీజీ బంగారు తల్లి ఫౌండేషన్‌కు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉషా తదితరులు పాల్గొన్నారు. (Story: మహిళలు అన్ని రంగాలలో రాణించాలి)