షరతులను తొలగించి మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి
ఎన్ఎఫ్ఐ డబ్ల్యు రాష్ట్ర అధ్యక్షులు సృజన
న్యూస్ తెలుగు/వనపర్తి : జనగణన, నియోజకవర్గాల పునర్విభజన షరతులను తొలగించి 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఎన్ఎఫ్ఐ డబ్ల్యు రాష్ట్ర అధ్యక్షులు సృజన డిమాండ్ చేశారు. ఎన్ఎఫైడబ్ల్యూ విస్తృతస్థాయి జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశం శనివారం ఎన్ఎఫ్ఐ డబ్ల్యు జిల్లా కార్యదర్శి గీత అధ్యక్షతన వనపర్తి కార్యాలయంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 9 ఏళ్ళు మహిళా రిజర్వేషన్లను గురించి పట్టించుకోని బిజెపి ప్రభుత్వం ఎన్నికల ముందు ఓట్ల కోసం సెప్టెంబర్ 19, 2023న చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లును ఆమోదించిందన్నారు. ఈ చట్టాన్ని దేశంలో జనగణన, నియోజకవర్గాల పునర్విభజన అనంతరం అమలు చేయాలని చట్టంలో షరతులు పెట్టిందన్నారు. షరతులను తొలగించి రానున్న అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. మహిళలకు రాష్ట్ర శాసనసభ పార్లమెంట్ ఉభయసభల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించాలని భారత జాతీయ మహిళా సమాఖ్య సెప్టెంబర్ 12, 2024న ఢిల్లీలో సమావేశమై తీర్మానించింది అన్నారు. ఇందుకోసం రెండో దశ పోరాటం చేయాలని నిర్ణయించిందన్నారు. అసెంబ్లీ పార్లమెంట్ స్థానిక సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం గ్రామాల్లో సంఘాలు ఏర్పాటు చేసుకొని మహిళల హక్కుల కోసం, ఎన్నికల్లో విజయం కోసం కృషి చేయాలన్నారు. మహిళలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు కోసం మహిళలు సంఘటితంగా పోరాడాలన్నారు. 33% మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని, అర్హత ఉన్న ప్రతి మహిళకు రూ. 2500 ఇవ్వాలని, పింఛన్లు పెంచాలని ప్రభుత్వాలు వెంట పడాలన్నారు. భారత జాతీయ మహిళా సమాఖ్య 22వ మహాసభలుడిసెంబర్ 6, 7, 8 తేదీల్లో ఢిల్లీలో జరగనున్నాయన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో 33% మహిళా రిజర్వేషన్లలో కొన్ని అత్యవసరమైన మార్పులు చేయాలని నవంబర్ 23న హైదరాబాదులో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఎన్ఎఫ్ఐ డబ్ల్యు ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు కళావతమ్మ, సిపిఐ జిల్లా కార్యదర్శి కె విజయరాములు, సిపిఐ వనపర్తి పట్టణ కార్యదర్శి జే. రమేష్, ఏఐటియూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ సందేశాలు ఇచ్చారు. పట్టణ కన్వీనర్ జయమ్మ, కో కన్వీనర్లు సునీత, భూమిక, శిరీష వివిధ మండలాల నుంచి మహిళా నాయకులు పాల్గొన్నారు.(Story:షరతులను తొలగించి మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి )