త్వరలో ప్రారంభమయ్యే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రణాళికాబద్ధంగా సన్నద్ధం కావాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : త్వరలో ప్రారంభమయ్యే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రణాళికాబద్ధంగా సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ యం. నగేష్, జిల్లా అధికారులు, తహశీల్దార్లతో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించడానికి ప్రభుత్వ ఉత్తర్వులు సంఖ్య 18 విడుదల చేయడం జరిగిందని, సర్వే కొరకు త్వరలో పూర్తిస్థాయి విధి విధానాలు జారీ చేయడం జరుగుతుందన్నారు.
జిల్లాలో ఏ ఒక్క ఇల్లు, కుటుంబం వదలకుండా అన్ని కుటుంబాలు, ఇళ్ళు సర్వేలో నమోదు అయ్యే విధంగా ప్రణాళికలు చేసుకోవాలని సూచించారు. 2011 సర్వే ప్రకారం ఉన్న ఎన్యుమరేషన్ బ్లాక్ లను గుర్తించి వాటి ప్రకారం మున్సిపాలిటీ, గ్రామస్థాయిలో ఎన్యుమరెటర్ లను ఎంపిక చేసుకోవాలని సూచించారు. అంగన్వాడి కార్యకర్తలు, పంచాయతీ సెక్రటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్ లు, టెక్నికల్ అసిస్టెంట్ లు, వి. ఏ. ఒ లు లను ఎన్యుమరెటర్లుగా ఎంపిక చేయాలని సూచించారు. మండల, జిల్లా స్థాయి కార్యాలయాల్లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ లు, సీనియర్ అసిస్టెంట్, ఎంపీడీఓ, ఎంపీలు తదితర సిబ్బందిని సూపర్వైజర్ లుగా ఎంపిక చేయడం జరుగుతుంది. మండల నోడల్ అధికారులు, జిల్లా నోడల్ అధికారులను ఎంపిక చేసి సమగ్ర ప్రణాళికతో సర్వేకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు.
కుటుంబ సర్వే పై మాస్టర్ ట్రైనర్ లు త్వరలో మండల, గ్రామ స్థాయి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
వనపర్తి జిల్లాలో 5 మున్సిపాలిటీలతో పాటు 228 రెవెన్యూ గ్రామాలు అందులో 262 గ్రామ పంచాయతీల్లో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాల్సి ఉంటుంది. 2011 తర్వాత కొత్తగా ఏర్పడిన ఆవాస ప్రాంతాలు, ఇళ్లను గుర్తించి ఎన్యుమరెటర్ బ్లాకులు చేయాల్సి ఉంటుందని తెలియజేశారు.
అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ యం నగేష్, ఆర్డీఓ పద్మావతి, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్, తహశీల్దార్లు పాల్గొన్నారు. (Story : త్వరలో ప్రారంభమయ్యే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రణాళికాబద్ధంగా సన్నద్ధం కావాలి)