అనధికార ఆక్రమణలను తొలగించండి
నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
న్యూస్ తెలుగు/విజయవాడ : అనధికార ఆక్రమణలను తొలగించేందుకు ప్రతి ఒక్క సెక్రటరీ దగ్గర మాస్టర్ ప్లాన్ ఖచ్చితంగా ఉండాలని, మున్సిపల్, ప్రభుత్వ స్థలాలను సంరక్షించుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సంబందిత అధికారులను ఆదేశించారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ శుక్రవారం ఆక్రమణల తొలగింపుపై ప్లానింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని అనధికార ఆక్రమణలను అడ్డుకోవాలని తెగేసి చెప్పారు. నగరంలో అనధికార బ్యానర్లు, హోర్డింగ్‌లు ఎక్కడా లేకుండా చర్యలు తీసుకోవాలని, అధికారికంగా ఏర్పాటు చేసే హోర్డింగ్‌లకు ఖచ్చితంగా స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికెట్ చూసుకోవాలని ఆదేశించారు. అనధికార ఆక్రమణలు, అనధికార కట్టడాలను ఏమాత్రం ఉపేక్షించకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలన్నారు. సెక్రటరీ సిబ్బంది ప్రతి ఒక్కరూ ఒకరితో ఒకరు సమన్వయంతో పని చేయాలని, సచివాలయం పరిధిలో ఉన్న ఏ సమస్య అయినా సమన్వయంతో తక్షణ పరిష్కారాన్ని చేపాలని ఆదేశించారు. ఈ సమావేశంలో చీఫ్ సిటీ ప్లానర్ జీవీజీఎస్‌వీ.ప్రసాద్, డీసీపీ చంద్రబోస్, ఏసీపీ మోహన్‌బాబు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, సచివాలయం ప్లానింగ్ సెక్రటరీలు పాల్గొన్నారు. (Story : అనధికార ఆక్రమణలను తొలగించండి)