మన భాషను మనమే పరిరక్షించుకోవాలి – భావితరాలకు ఆదర్శం కావాలి సిడం అర్జు
న్యూస్ తెలుగు/చింతూరు : మన భాష ను మనమే పరిరక్షించుకోవాలని భావితరాల వారికి ఆదర్శం కావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలంగాణ రాష్ట్రం రాజ్ గోండ్ సేవా సమితి రాష్ట్ర కన్వీనర్ సిడం. అర్జు పేర్కొన్నారు. పోలవరం జిల్లా చింతూరు మండలం లోని రామన్నపాలెం గ్రామంలో శనివారంపూనెం బాబురావు అధ్యక్షతన జరిగిన రజితోత్సవ కార్యక్రమంలో కోయత్తోర్ బాట బాల సాహిత్య సమన్వయ కర్త యాదయ్య పాల్గొని ప్రసంగిస్తూ . కోయ భాషను భావితరాల వారికి అందించటానికి కోయత్తోర్ బాట గత 25 ఏళ్లుగా ఎంతో కృషి చేస్తుందని, ప్రశంసించారు. ఈ సందర్భంగా కోయ రచయితలు,దుమ్మిరి భీమమ్మ,తెల్లం కృష్ణ, బొక్కిలి నాగేశ్వరరావు రచించిన విజ్జ, అలింబిలం కోటై, గాలి గాలి కుక్కు, అనే మూడు పుస్తకాలను అతిథులందరూ ఆవిష్కరించారు. వార్త పత్రిక పూర్వ సంపాదకులు టంకశాల అశోక్ మాట్లాడుతూ కోయ భాష అంతరించిపోయే ప్రమాదంలో ఉంది కావున తమ భాష పరిరక్షణకు గిరిజన విద్యాధి కులందరు కృషి చేయాలని, సాంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆంత్రపాలజీ ప్రొఫెసర్ శివప్రసాద్ మాట్లాడుతూ కోయత్తో ర్ బాట గత 25 ఏళ్లుగా డ్రాప్ అవుట్ విద్యార్థులకు మార్గదర్శిగా నిలిచి ఉన్నత చదువులకు వెళ్లడానికి ఎంతగానో కృషి చేసిందని, వారి కృషి మరువలేనని కొనియాడారు. ఈ సందర్భంగా సమత స్వచ్ఛంద సంస్థ బాధ్యులు రెబ్బ ప్రగడ రవి మాట్లాడుతూ 5 షెడ్యూల్ ప్రకారం ఏజెన్సీలోని బాక్సైట్ లాంటి ఖనిజాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత గిరిజనులపై ఎంతగానో ఉందని ఆ దిశగా ముందుకు వెళతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే కోయ బాల సాహిత్యాన్నిఅన్ని గిరిజన ప్రాంతాలకు విస్తరించాలని కోరారు. కోయ రచయిత్రి కుంజా కళ్యాణి మాట్లాడుతూ తాను కోయ భాష లో కవిత్వం నేర్చుకోవడానికి కోయతో రు బాటకు వచ్చి నేర్చుకుంటానని, తద్వారా గిరిజనులకు భాష పెంపొందించేందుకు తోడ్పడుతానని పేర్కొన్నారు. ఎం.వి ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ కోయత్తో ర్ బాట గత 25 సంవత్సరాలుగా చేసిన సేవలు మరువరానివని, డ్రాప్ అవుట్ విద్యార్థులకు ఎంతగానో సేవ చేసిందని పేర్కొన్నారు. సికింద్రాబాద్ వృద్ధాశ్రమం నిర్వాహకులు ఫాదర్ పీటర్ డానియల్ మాట్లాడుతూ తనకు కోయ త్తో ర్ బాటకు ఉన్న సంబంధ బాంధవ్యాలను గుర్తుకు తెచ్చుకొని చేసిన సేవలను కొనియాడారు. కోయత్తోర్ బాట పూర్వ అకడెమిక్ సమన్వయ కర్త డాక్టర్ పాండు మాట్లాడుతూ తాను 25 సంవత్సరాలుగా కోయతోర్ బాటకు ఉన్న అనుబంధాన్ని, విద్యార్థులకు నేర్పిన పాఠాలను గుర్తు చేశారు.* ఈ కార్యక్రమంలో చిన్న పిల్లలు పాడి వినిపించిన పాటలు బాల గేయాలు ఆహుతులను ఆకట్టు కున్నాయి . చింతూరు కోయ యువతీ యువకులు చేసిన రేల నృత్యం ను పలువురు వక్తలుప్రశంసించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద పటేలు బ్రహ్మయ్య, అధ్యక్షులు వెంకటలక్ష్మి తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు.(Story : మన భాషను మనమే పరిరక్షించుకోవాలి – భావితరాలకు ఆదర్శం కావాలి సిడం అర్జు )
