చేనేత వ్యాపారస్తులు నిలువు దోపిడికి గురవుతున్నారు
పట్టు చీరల తయారీ వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు గిర్రాజు రవి
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టు చీరల కు ప్రసిద్ధి ధర్మవరం అని, ధర్మవరంలో వ్యాపారస్తుల యొక్క చీరలను ఇతర రాష్ట్రాల వారు కొని డబ్బులు ఇవ్వకుండా అన్యాయంగా నిలువు దోపిడీకి గురి చేస్తున్నారని పట్టు చీరల తయారీ వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు గిర్రాజ రవి తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఒక దొంగతనం జరిగినప్పుడు దొంగకు చట్టపరంగా అన్ని రకాలుగా శిక్షలు వేస్తారు, మరి ఏళ్ల తరబడి నమ్మకంతో తాము ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులకు చీరలు ఇస్తున్నామని, ఆ చీరలు కొనుగోలు చేసిన వారు నేడు డబ్బులు ఇవ్వకుండా, భయాందోళనకు గురి చేయడం జరుగుతుందని దీనివల్ల చేనేత వ్యాపారస్తులు యొక్క జీవన విధానం ప్రశ్నార్థకంగా మారింది అని తెలిపారు. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులు, వ్యాపారస్తులు, వీవర్స్ యొక్క సమస్యలను పరిష్కరించాల్సిన సమయం ఆసన్నమైనదని తెలిపారు. ధర్మవరంలోని వ్యాపారస్తులు వందల కోట్ల రూపాయలు ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మా అసోసియేషన్ ద్వారా కొద్ది మందికి మాత్రమే ఇప్పించడం జరిగిందని, మరికొంతమంది స్పందించడం లేదని, రాజకీయ అండ దండలతో మా వ్యాపారస్తుల డబ్బులు ఎగనామం పెట్టడం ఎంతవరకు సమంజసమని వారు తెలిపారు. నేడు కార్పొరేట్ సంస్థలు రాజకీయ అండదండలు చూసుకొని, ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్ల ధర్మవరం వ్యాపారస్తుల యొక్క జీవన విధానం అతలాకుతలం అయిందని తెలిపారు. భవిష్యత్తులో అన్ని వ్యాపారస్తుల సంఘాలు ఐక్యమై చట్టపరంగా పోరాడుతామని తెలిపారు. గతంలో న్యాయమైన వ్యాపారం చేసేవారని, నేడు అది మాకు శాపంగా మారిందని, చీరలు కొనుగోలు చేసిన వారికి చట్టపరంగా ఎటువంటి శిక్షలు లేకపోవడం వల్ల మా జీవన పరిస్థితి దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత వ్యాపారస్తులకు చట్టాలను మరింత కఠిన తరం చేయాలని తెలిపారు. చీరలు కొనుగోలు చేసి మోసం చేసే వారిపై కఠిన చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత అధికారులు చర్యలు తీసుకున్నప్పుడే వ్యాపారస్తులు యొక్క జీవన ప్రమాణం మెరుగుపడే అవకాశం ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి హేమంత్ కుమార్, ఉపాధ్యక్షులు నీలూరి శ్రీనివాసులు పాల్గొన్నారు. (Story : చేనేత వ్యాపారస్తులు నిలువు దోపిడికి గురవుతున్నారు)