21 కోట్ల 56 లక్షల రోడ్డు నిర్మాణ పనులు
డిసెంబర్ 9 లోగా రైతులందరికీ రుణమాఫీ
పొలం బాట కార్యక్రమంలో పొలాలకు రోడ్లు ఏర్పాటు
విద్యార్థులు నూతన పరిజ్ఞానాన్ని నేర్చుకోవాలి : మంత్రి సీతక్క
న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) : ములుగు నియోజకవర్గంలో రోడ్లు మరమ్మతులు చేయవలసిన రోడ్లకు 21 కోట్ల 56 లక్షల సి ఆర్ ఆర్, ఎం.ఆర్ ఆర్ రూపాయలతో మంజూరు చేసి పనులను ప్రారంభించడం జరిగిందని, ఈ సంవత్సరం డిసెంబర్ 9 లోగా రెండు లక్షల లోపు ఉన్న రైతుల రుణాలన్నీ మాఫీ చేయడం జరుగుతుందని, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ దివాకర్ టీ.ఎస్ కలసి వెంకట పూర్ జెడ్ పి హెచ్ ఎస్ లో కంప్యూటర్ ల్యాబ్, (సి ఎస్ ఆర్ నిధులు మౌరిటెక్ ఐటి సంస్థ సౌజన్యం) 10 కంప్యూటర్ల తొ ప్రారంభించారు. అనంతరం గోవిందరావుపేట, ఎస్ ఎస్ తాడ్వాయి మండలాల్లో
21 కోట్ల 56 లక్షల సి ఆర్ ఆర్, ఎం.ఆర్ ఆర్ రూపాయలతో 15 రహదారుల ప్రత్యేక మరమత్తు పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ విద్యార్థులు నూతన పరిజ్ఞాన విద్యను నేర్చుకోవడానికి ప్రయత్నించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ వేలాది మంది నిరుద్యోగులకు
ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతున్నదని, ములుగు జిల్లాలో 176 మందికి ఉపాధ్యాయ పోస్టులు ఇవ్వడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను అందించడానికి అన్ని చర్యలు తీసుకోవడంతో పాటు, అన్ని కులాల విద్యార్థినీ విద్యార్థులు ఒకే చోట విద్యను అభ్యసించడానికి ఇటీవల, ఇంచర్ల గ్రామ సమీపంలో 125 కోట్ల రూపాయలతో నిర్మించే ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. రైతులు ఇబ్బందులు గురికాకుండా, పంట పొలాలకు వెళ్లడానికి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయడంతో పాటు, నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అటవీ ప్రాంతాలలో పాఠశాలల, ఆస్పత్రుల భవనాల నిర్మాణం కోసం అనుమతి ఇవ్వకపోవడంతో నూతనంగా అటవీ ప్రాంతంలో కంటైనర్ పాఠశాలను, ఆసుపత్రిని ఏర్పాటు చేశామని తెలిపారు. ములుగు నియోజకవర్గం 75 శాతం అటవీ ప్రాంతంతో కూడి ఉండడంతో, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలుగుతున్నదని, దీనిపై తాను స్వయంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కరించడానికి కృషి చేశానని తెలిపారు. జిల్లాల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి కృషి చేయడం జరుగుతుందని దీనిలో భాగంగా విద్య వైద్యం మెరుగుపరచడంతో పాటు రోడ్డు సౌకర్యాలకు ప్రత్యేక కార్యచరణ రూపొందించడం జరిగిందని అన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రవర్తనను ఆధారంగా చేసుకుని విద్యార్థులు ముందుకు పోతారని ఉపాధ్యాయులు మంచి పరివర్తన కలిగి విద్యార్థులను ఉన్నత శిఖరాలకు ఎదిగే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు.
గోవిందరావు పేట లో కల్యాణ లక్ష్మి చెక్కులను 13 మంది లబ్దిదారులకు,
తాడ్వాయి రైతు వేదికలో కల్యాణలక్ష్మి, షాదిముభారక్ చెక్కులను 35 మంది లబ్దిదారులకు
మంత్రి సీతక్క చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమాలలో పంచాయితి రాజ్ ఈ ఈ అజయ్ కుమార్, డి ఈ ఓ పాణిని, మౌరిటెక్ ఐటి కంపని ప్రతినిధులు నందమోహన్, మనోజ్ కుమార్, హెడ్మాస్టర్ రాధిక, అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షురాలు ఫరీద బేగం, తహసీల్దార్లు, ఎం పి డి ఓ లు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థినీ, విద్యార్థులు, కల్యాణ లక్ష్మి,
షాదిముబారక్ పొందిన లబ్ధిదారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. (Story : 21 కోట్ల 56 లక్షల రోడ్డు నిర్మాణ పనులు)