విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలు మరువలేనివి
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
న్యూస్‌తెలుగు/ విజయనగరం : విధి నిర్వహణలో మరణించిన పోలీసు అమర వీరులను స్మరించుకొంటూ అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంను జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని, అదే విధంగా అక్టోబరు 21 నుండి 31 వరకు పలు కార్యక్రమాలను చేపడుతున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు
శాంతియుత సమాజం కోసం విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం కోల్పోవడం వారి త్యాగ నిరతికి నిదర్శనమన్నారు. నేడు మన మధ్య వారు భౌతికంగా లేకపోయినప్పటికీ, వారి త్యాగాలను మరువలేమన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకొంటూ అక్టోబరు 21న జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణంలో గల ‘స్మృతి వనం’లో విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన పోలీసు అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించనున్నామన్నారు. పోలీసు అమర వీరుల త్యాగాలను స్మరిస్తూ స్మృతి పరేడ్ నిర్వహించి, ర్యాలీ చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొంటారన్నారు.
అక్టోబరు 21 నుండి 31 వరకు జిల్లా వ్యాప్తంగా వివిధ సినిమా థియేటర్లులో పోలీసు ఇమేజ్ను రెట్టింపు చేసే విధంగా గుర్తింపు పొందిన సినిమాలను, వీడియో క్లిప్స్ ను ప్రదర్శించేందుకు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించామన్నారు.
అక్టోబరు 22 నుండి 30 మధ్య జిల్లా పోలీసుశాఖలో పని చేస్తూ, విధి నిర్వహణలో మరణించిన పోలీసు అమరవీరుల స్వస్థలాలలను, వారు చదువుకున్న పాఠశాలలను పోలీసు అధికారులు, సిబ్బంది సందర్శించి, పోలీసుశాఖకు వారు అందించిన సేవలను వివరిస్తామన్నారు.
అక్టోబరు 26, 27 తేదీల్లో జిల్లా కేంద్రం, బొబ్బిలి, చీపురుపల్లి సబ్ డివిజన్లో ‘ఓపెన్ హౌస్’ కార్యక్రమాన్ని నిర్వహించి, పోలీసులు విధి నిర్వహణలో వినియోగించే వివిధ ఆయుధాలు, టెక్నాలజీ, నేర పరిశోధనలో డాగ్స్ ను ఏవిధంగా వినియోగిస్తారన్న అంశాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు.
అక్టోబరు 24 నుండి 27 వరకు జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లోను, జిల్లా కేంద్రంలోను ‘రోల్ ఆఫ్ యూత్ ఇన్ ప్రివిన్షైన్ ఆఫ్ సైబరు క్రైం’ అన్న అంశం మీద వ్యాస రచన, వక్తృత్వ పోటీలను నిర్వహిస్తామన్నారు.
అక్టోబరు 28న పోలీసు కార్యాలయ ప్రాంగణంలో మెడికల్ క్యాంపు, రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో పోలీసు కుటుంబాలు, పోలీసు సిబ్బంది, ప్రజలు పాల్గొని, వైద్య సేవలు పొందవచ్చునన్నారు. అదే విధంగా పోలీసు సిబ్బంది, అధికారులు రక్తదానం చేసి, ప్రమాదాలు, శస్త్ర చికిత్సలకు గాయపడి, అత్యవసర వైద్య చికిత్సకు అవసరమైన రక్తంను సరఫరా చేసేందుకు రక్త నిధులకు అందజేయనున్నామన్నారు.
అక్టోబరు 29న జిల్లా వ్యాప్తంగా విజయనగరం, బొబ్బిలి, చీపురుపల్లి సబ్ డివిజన్స్ పరిధిలోని కళాశాలలు, పాఠశాల్లో “పోలీసుల త్యాగాలు” అన్న అంశం మీద సెమినార్స్ నిర్వహిస్తామన్నారు
అక్టోబరు 30న ఉదయం జిల్లా కేంద్రంలో ప్రజల్లో జాతీయ సమైఖ్యతను పెంపొందించేందకు ‘యూనిటీరన్’ నిర్వహిస్తామన్నారు. ఈ యూనిటీ రన్ లో ప్రజలు, యువత, పోలీసులు భాగస్వామ్యులవుతారన్నారు. అదేవిధంగా సాయంత్రం పట్టణంలోని మూడు లాంతర్లు నుండి కోట జంక్షను వరకు ‘క్యాండిల్ ర్యాలీ’ నిర్వహిస్తామని తెలిపారు. (Story : విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలు మరువలేనివి)